పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై అవగాహన కల్పించండి : ఇసికి టిడిపి విజ్ఞప్తి

May 18,2024 21:33 #2024 elction, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అవగాహన కల్పించాలని టిడిపి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి పి కోటేశ్వరరావును ఆ పార్టీ ఎమ్మెల్సీ పి అశోక్‌ బాబు, మాజీ ఎమ్మెల్సీ ఎఏస్‌ రామకృష్ణ, మీడియా కోఆర్డినేటర్‌ దారపనేని నరేంద్ర సచివాలయంలో శనివారం కలిసి ఈ మేరకు వినతిపత్రం అందించారు. ఎన్నికల విధులకు హాజరైన ఉద్యోగులందరూ ఫారమ్‌ 12/12డి దాఖలు చేసే సమయంలో ఉద్యోగస్తులు గెజిటెడ్‌ ఆఫీసర్‌ ధృవీకరణతో డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఫెలిసిటేషన్‌ సెంటర్‌లోనే ప్రభుత్వం తరపున ఒక గెజిటెడ్‌ ఆఫీసర్‌ను నియమిస్తారని, కాని కొన్ని చోట్ల డిక్లరేషన్‌లపై కొంతమంది గెజిటెడ్‌ అధికారులు తమ డిజిగేషన్‌ స్టాంపు గానీ, అఫీసీయల్‌ సీల్‌ కానీ వేయలేదని పేర్కొన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ సమయంలో కొన్ని చోట్ల ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు బ్యాలెట్‌ పేపర్‌ వెనుక వారి సంతకం గానీ, ముద్రకానీ వేయలేదన్నారు. ఈ నెల 10వ తేదిన ఎన్నికల కమిషన్‌ దృష్టికి ఈ అంశాలను తీసుకొచ్చామని వివరించారు. ఈ లోపాల వల్ల ఎన్నికల నిబంధనల ప్రకారం బ్యాలెట్‌ పేపర్లను ఇన్వాలిడ్‌ చేసే అవకాశం ఉందని తెలిపారు. వీటిని వ్యాలిడ్‌ ఓట్లుగా పరిగణించి బ్యాలెట్‌ కౌంటింగ్‌లో చేర్చాలని కోరారు. ఎన్నికలు ముగిసినా ఈ అంశంపై ఇప్పటివరకు ఎటువంటి లిఖిత పూర్వక ఉత్తర్వులు సిఇవో కార్యాలయం నుంచి విడుదల కాలేదని తెలిపారు.

ఓటమి భయంతో రక్తపాతం : వర్ల రామయ్య
జగన్‌ తీరు దొంగే దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శించారు. ఓటమిని జీర్ణించుకోలేక రాష్ట్రంలో రక్త చరిత్రను సృష్టించి ఎన్నికల కమిషన్‌పై మళ్లీ బురద చల్లేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. టిడిపి కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతో జగన్‌ ప్లాన్‌ బితో అరాచకం సృష్టించారని తెలిపారు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనల నుంచే అధికారులను ఎన్నికల కమిషన్‌ నియమించిందని తెలిపారు. 2019లో ఒకే రోజు డిజిపి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటిలిజెన్స్‌ డిజితో పాటు పలువురు ఎస్పీలను తొలగిస్తే ఎన్నికల కమిషన్‌ చర్యలు భేష్‌ అని జగన్‌ మెచ్చుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.

వైసిపి నేతలను అరెస్టు చేయాలి : సిట్‌ అధికారిని కలిసిన టిడిపి
వైసిపి నేతలు పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి సోదరులను, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, మోహిత్‌ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డిలను వెంటనే అరెస్టు చేయాలని సిట్‌ చీఫ్‌ వినిత్‌ బ్రిజ్‌లాల్‌ను టిడిపి కోరింది. ఆ పార్టీ పొలిట్‌ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య, నేతలు మన్నవ సుబ్బారావు, కోడూరి అఖిల్‌ శనివారం సిట్‌ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. మాచర్ల, తాడిపత్రి, తిరుపతి, నరసరావుపేట, అనంతపురాల్లో జరిగిన సంఘటనలపై వీడియో క్లిప్లింగ్‌లను వినిత్‌కు అందించామని అనంతరం నాయకులు మీడియాతో చెప్పారు. తప్పుచేసిన వారిని శిక్షించి తప్పుచేయనివారికి తోడుగా ఉండాలని కోరామని అన్నారు. అందరికీ సమన్యాయం చేయాలని తెలిపారు. తమ ఫిర్యాదులపై వినిత్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు.

➡️