కొత్త ఆర్థిక సంవత్సరం వల్ల ఆలస్యం : పెన్షన్ల పంపిణీపై వైసిపి

Apr 3,2024 10:47 #delay, #pensions, #YCP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగిసి ఏప్రిల్‌ ఒకటి నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలైనందున రెండు రోజులు ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ చేపట్టామని వైసిపి తెలిపింది. ప్రతియేటా ఏప్రిల్‌ నెలలో రెండు రోజులు ఆలస్యంగానే పెన్షన్ల పంపిణీ అయినట్లుగానే ఈ ఏడాదీ అయ్యిందని, ఈ అంశంపై చంద్రబాబు దుష్ప్రచారం చేయడం తగదని పేర్కొంది. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్లానింగ్‌ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, వైసిపి అధికార ప్రతినిధి నారాయణమూర్తి మంగళవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన కుట్ర రాజకీయాలను మరోసారి బయటపెట్టుకున్నారని అన్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావున బ్యాంకుల కార్యకలాపాలు ఏప్రిల్‌ 1, 2 తేదీల్లో పూర్తి స్థాయిలో పనిచేయవని అన్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి ముత్యాల నాయుడు ఈ నెల 3 నుంచి పెన్షన్లు ఇస్తారని ప్రకటన కూడా చేశారని తెలిపారు.

➡️