మీ ఓటు..పోరాటానికి శక్తినిస్తుంది..!

May 9,2024 07:46 #2024 election, #cpm
  • ఆలోచించి నిర్ణయం తీసుకోండి : బివి రాఘవులు

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : ప్రజలు వేసే ప్రతి ఒక్క ఓటు పోరాటాలకు శక్తి నిస్తుందని, కమ్యూనిస్టులు లేని శాసనసభ నిస్సారంగా కనిపిస్తోందని, ప్రజల తరపున పోరాటం చేసే వ్యక్తులను ఆదరించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు కోరారు. ఇండియా వేదిక అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ నెల్లూరు నర్తకి సెంటర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వైసిపి, టిడిపిలు బిజెపికి తొత్తులుగా మారాయని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు జగన్‌, చంద్రబాబు కలిసి పార్లమెంట్‌లో ఓటు వేస్తున్నారని, ఇక్కడ కథలు చెబుతున్నారన్నారు. రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపికి లోబడి ఆ రెండు పార్టీలూ పనిచేస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా, కడప ఉక్కు పరిశ్రమ, విశాఖపట్నం రైల్వే జోన్‌, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ బిజెపి సహకారం అందివ్వలేదన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్యాకేజీ ఇస్తామని చెప్పారని అది కూడా నీటి మీద హామీలాగానే మిగిలిపోయాయన్నారు. పది సంవత్సరాల పాటు రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి టిడిపి, వైసిపిలు దోస్తులుగా ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాని కారణంగా పరిశ్రమలు అభివృద్ధి చెందలేదని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాలేదని వివరించారు.
అమరావతి రాజధాని విషయంలో అన్ని పార్టీలూ ఆమోదం తెలిపాయని, 2014లో చంద్రబాబునాయుడు చిత్రాలు చూపించారని, పూర్తి చేయలేకపోయారన్నారు. రాజధాని నిర్మాణం జరిగి ఉంటే సిఎం జగన్‌ మూడు రాజధానుల అంశానికి అవకాశం ఉండేది కాదన్నారు. గిట్టుబాటు ధర కోసం ఏడాది పాటు ఢిల్లీలో రైతులు ఆందోళన చేశారని, 22 పంటలకు గిట్టుబాటు ధర కావాలని, చట్టం తీసుకురావాలని రైతులు కోరితే బిజెపి మోసం చేసిందన్నారు. ఎన్‌ఆర్‌సి చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకించింది ఇండియా వేదికనే అని చెప్పారు. దేశంలో అతిపెద్ద అవినీతి పార్టీ బిజెపినే అని, రూ.18 వేల కోట్ల ఎలక్టోరల్‌ బాండ్లలో బిజెపికే రూ. రూ. 8600 కోట్లు వెళ్లాయన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు సిపిఎంకు మాత్రమే ఉందన్నారు. 250 ప్రభుత్వ రంగ సంస్థలున్నాయని, వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడానికి మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ తరుపున పోటీ చేస్తున్న కె.రాజు ఇక్కడే పనిచేశారని ప్రజా కలెక్టర్‌గా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. సిపిఎం నెల్లూరు నగర అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మూలర రమేష్‌.. ప్రజల కోసం జైలు జీవితం గడిపారని, అలాంటి వ్యక్తులను చట్టసభలకు పంపాలని కోరారు. గెలుస్తారా? ఓటు వేద్దామా? అని అనుకోవద్దని, మీరే వేసే ప్రతి ఓటూ పోరాటం చేయడానికి శక్తి నిస్తుందన్నారు. కమ్యూనిస్టులు శాసన సభలో ఉంటేనే ప్రజాసమస్యలు చర్చకు వస్తాయన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె.అజరుకుమార్‌ అధ్యక్షత వహించారు. నెల్లూరు పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కె.రాజు, సిపిఎం నెల్లూరు సిటీ అభ్యర్థి మూలం రమేష్‌, మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డి.రమాదేవి, సిపిఐ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య, సిపిఎం సీనియర్‌ నాయకులు చండ్ర రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️