శ్రేణులకు అండగా ఉండండి

Jun 13,2024 23:42 #meeting, #YCP MLCs, #YS Jagan's
  • వైసిపి ఎమ్మెల్సీలకు జగన్‌ దిశానిర్దేశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని ఎంఎల్‌సిలకు మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో గురువారం ఉదయం ఆయన వైసిపి ఎంఎల్‌సిలతో సమావేశమైనారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంత కాలం గెలిచిన వారికి అవకాశం ఇద్దామని అన్నారు. ఆ తర్వాత ప్రజల పక్షాన ప్రజల్లో తిరిగే కార్యక్రమాలను చేపడదామని తెలిపారు. భవిష్యత్‌ తమదేనని చెప్పారు. వైసిపి శ్రేణులపై దాడులు చేయిస్తూ చంద్రబాబునాయుడు తొలి తప్పు చేశారని చెప్పారు. దాడులకు గురవుతున్న పార్టీ కార్యకర్తలకు ధైర్యం చెప్పాలని అన్నారు. ఇటువంటి పరిస్థితులను ఎదుర్కుని గతంలో లేచి నిలబడ్డామని, ఇప్పుడు కూడా అలాగే నిలబడతామని ఆయన చెప్పారు. కన్ను మూసి తెరిచే లోగానే ఐదేళ్ల అధికార కాలం గడిచిపోయిందని, మరో ఐదేళ్లు కూడా అలాగే గడిచిపోతాయని అన్నారు. ఈ కాలంలో కార్యకర్తలకు, ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైనా 40 శాతం మంది ప్రజలు తమతోనే ఉన్నారని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని విస్మరించవద్దని, ఎవరూ మనోధైర్యాన్ని కోల్పోవద్దని ఎంఎల్‌సిలకు ఆయన సూచించారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వైసిపి శ్రేణులపై దాడులు చేస్తోందని చెప్పిన ఆయన, అవకాశం ఉన్నా హోదాను అడగకపోవడం రెండవ తప్పు అని అన్నారు. ఇలా చూస్తూ ఉండగానే శిశుపాలుడిలా 100 తప్పులు పూర్తిచేస్తారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం తప్పులను శాసనసభలో సంఖ్యాబలం రీత్యా నిలదీసే అవకాశాలు తక్కువగా వున్నాయని, మండలిలో మనకున్న సంఖ్యాబలంతో ప్రజా సమస్యలు, రాష్ట్రాభివృద్ధిపై నిలేయాలని అన్నారు. సంఖ్యాపరంగా ఎమ్మెల్యేలు తక్కువ వున్నందున వైసిపికి ప్రతిపక్షహోదా ఇస్తారా లేదా అనేది వేచి చూడాలన్నారు. నైతికవిలువల ప్రకారం సభలో ప్రతిపక్షాన్ని గుర్తించాలన్నారు. ‘కేంద్రంలో ఇప్పుడున్న పరిస్థితులు ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేదు.కేంద్రంలో అధికారపార్టీ 240 సీట్లకు పరిమితమైంది. రాష్ట్రంలో టిడిపికి మంచి సంఖ్యలో సీట్లు రావడంతో పాటు ఎన్‌డిఎలో కీలకంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో కూడా ప్రత్యేకహోదాను అడగకపోవడం చంద్రబాబు చేసిన శాపం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా హోదా అడక్కపోతే, రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు.’ అని జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు.

➡️