న్యాయం, ధర్మం కోసం పోరాటం

Apr 20,2024 21:30 #nomination, #YS Sharmila Reddy
  • అవినాష్‌ను కాపాడడంపై సమాధానం చెప్పాలి : వైఎస్‌ షర్మిల
  • కడప పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన్‌

ప్రజాశక్తి- కడప ప్రతినిధి : న్యాయం, ధర్మం కోసం పోరాడుతున్నామని, ప్రజలు ఆదరించాలని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల కోరారు. శనివారం కడప పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కడప నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వివేకా హత్యపై మాట్లాడొద్దని కోర్టు ఆర్డర్‌ తీసుకొచ్చారని, 2019 ఎన్నికల్లో ఈ అంశాన్ని ఎలా వాడుకున్నారని ప్రశ్నించారు. అప్పుడు సక్రమమైతే, ఇప్పుడు ఎలా అక్రమమవుతుందని నిలదీశారు. ఛార్జీషీట్‌లో ఉన్న అంశాలను, సిబిఐ సాక్ష్యాధారాలతో బయట పెట్టిన వాటినే ప్రస్తావిస్తున్నామని తెలిపారు. ఐదేళ్లుగా న్యాయం జరగలేదని, సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్తుంటే నోరుమూయించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. వివేకా కుమార్తె సునీత ఐదేళ్లుగా న్యాయం కోసం తొక్కని గడప లేదని, అటువంటి వ్యక్తి కొంగుచాపి న్యాయం చేయాలని ప్రజలను కోరుతోందని అన్నారు. ఇటువంటి పరిస్థితిలో న్యాయం కోసమే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. సిబిఐ ఐదేళ్లుగా విచారణ చేసి అవినాష్‌రెడ్డి దోషని చెప్పిందని, గూగుల్‌ మ్యాప్స్‌తో సహా ఆధారాలను సేకరించిందని అన్నారు. సిబిఐ ఆధారాలను చూపుతుంటే ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు అడ్డుపడుతున్నారో తెలియడం లేదని, నిందితుడిని ఎందుకు కాపాడుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఓబులేసు మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఎంపి అభ్యర్థి వైఎస్‌ షర్మిలను, వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాయలసీమ కరువు సమస్యలను పరిష్కరించే ప్రణాళికలు వామపక్షాల వద్ద ఉన్నాయన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని, సమైక్యతను ప్రధాని మోడీ దెబ్బతీస్తున్నారని, దీనిపై వైసిపి, టిడిపి ప్రశ్నించడం లేదని వివరించారు. పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి, వివేకా కుమార్తె సునీత ప్రసంగించారు. కాంగ్రెస్‌ పార్టీ కడప ఎమ్మెల్యే అభ్యర్థి ఆప్జల్‌ఖాన్‌, డిసిసి మాజీ అధ్యక్షులు నజీర్‌అహ్మద్‌, సంఘసేవకులు సలావుద్దీన్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు విష్ణుప్రీతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️