ఉమ్మడి రాజధానిపై.. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు 

YV Subbareddy's comments on joint capital were distorted

విభజన చట్టంలోని ప్రతి హామీనీ నెరవేర్చాలనేదే వైసిపి అజెండా : బొత్స

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : ఉమ్మడి రాజధాని విషయమై వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘సుబ్బారెడ్డి మాటలపై ప్రతిపక్షం విమర్శిస్తే దాన్ని ఖచ్చితంగా నేను ఖండిస్తాను. ఎవరైనా ఇంకా ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ అని ఎందుకంటారు..?. వైవి మాటల్ని నూటికి నూరుశాతం వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు ఉదయమే ఆయనతో నేనూ మాట్లాడాను’ అని చెప్పారు. విభజన చట్టంలోని ప్రతి అంశాన్నీ మేం సాధించాల్సి ఉందని మాత్రమే సుబ్బారెడ్డి చెప్పారన్నారు. విభజన హామీలను నెరవేర్చాలన్నదే తమ పార్టీ అజెండాగా ఉందని చెప్పారు. చంద్రబాబుతో పాటు అతని మిత్రపక్షాలకూ ఆంధ్రప్రదేశ్‌లో ఇల్లూ వాకిళ్లూ లేవన్నారు. గతంలో ఇక్కడ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకైనా, ఆయన మిత్రపక్ష నేత పవన్‌ కల్యాణ్‌కైనా సొంతిల్లు ఉండాలి కదా..? అక్కడొక ఓటు.. ఇక్కడొక ఓటు ఉన్నోళు.. ఇక్కడ డోర్‌ నెంబర్లు లేనోళ్లు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలా కుదురుతుందని విమర్శించారు. చంద్రబాబును ప్రతిపక్ష నేతగా ప్రజలు గుర్తించడం మానేశారని అన్నారు.

➡️