జాబిల్లిపై టైం ఎంత ? – నాసాకు శ్వేతసౌధం నుంచి కీలక ఆదేశాలు

Apr 3,2024 12:25 #moon, #NASA, #orders, #time, #White House

అమెరికా : చంద్రుడిపై యాత్రలకు దేశాలు, ప్రైవేటు సంస్థలు పోటీపడుతున్న వేళ .. ఆ గ్రహంపై ప్రామాణిక సమయాన్ని తయారు చేసేందుకు అమెరికా సన్నద్ధమయ్యింది. ఇప్పటికే దీనిపై పనిచేయాలని శ్వేత సౌధం నుంచి నాసాకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది చంద్ర యాత్రలకు వెళ్లే వాహక నౌకలు, ఉపగ్రహాలు కచ్చితత్వంతో పనిచేయడానికి చాలా కీలకం అని, కాబట్టి జాబిల్లిపై సమయం తెలిసేలా ఓ ఏకీకృత ప్రామాణిక గడియారాన్ని నిర్థారించాలని అమెరికా నుండి నాసాకు ఆదేశాలు వెళ్లాయి.. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. అంటే ఇంతవరకు ఏ దేశంలో టైం ఎంత ? అనుకున్న మనం ఇకపై చంద్రుడి పై టైం ఎంతై ఉంటుందో అనుకునే రోజులస్తున్నాయన్నమాట..!

2026 నాటికి ‘కోఆర్డినేటెడ్‌ లూనార్‌ టైమ్‌’….
శ్వేత సౌధంలోని ఆఫీస్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ పాలసీ (ఓఎస్‌టీపీ) చీఫ్‌ ఆర్తి ప్రభాకర్‌ నుంచి వెళ్లిన ఆదేశాలను అనుసరించి … నాసా ఇతర ప్రభుత్వ విభాగాలతో కలిసి 2026 నాటికి ‘కోఆర్డినేటెడ్‌ లూనార్‌ టైమ్‌’ కోసం వ్యూహాన్ని సిద్ధం చేయాలి. గురుత్వాకర్షణ శక్తిలో తేడాల కారణంగా సమయ నిర్థారణలో చోటుచేసుకొనే మార్పులను ఈ సందర్భంగా అంచనా వేయాల్సి ఉంటుంది. ఇది చంద్ర యాత్రలకు వెళ్లే వాహక నౌకలు, ఉపగ్రహాలు కచ్చితత్వంతో పనిచేయడానికి చాలా కీలకం. సాధారణంగా భూమిపై పనిచేసే గడియారం చంద్రుడిపైకి చేరితే రోజుకు 58.7 మిల్లీ సెకన్లను కోల్పోతుందని ఓఎస్‌టీపీ ఆదేశాల్లో ఉదహరించారు.

చంద్రుడిపై హృదయ స్పందనలను కోరుకుంటున్నారు : కెవిన్‌ కాగ్గిన్స్‌
దీనికి సంబంధించి నాసాకు చెందిన స్పేస్‌ కమ్యూనికేషన్స్‌ అండ్‌ నేవిగేషన్‌ చీఫ్‌ కెవిన్‌ కాగ్గిన్స్‌ మాట్లాడుతూ … భూమిపై ఒక వేగంతో కదిలే గడియారం చంద్రుడి ఉపరితలం పైకి చేరగానే భిన్నంగా ప్రవర్తిస్తుందని చెప్పారు. అమెరికా నేవల్‌ అబ్జర్వేటరీలోని అణుగడియారాల గురించి ఆలోచించాలని సూచించారు. అవి అమెరికా హఅదయ స్పందనలతో సమానమని… ఇప్పుడు చంద్రుడిపై హఅదయ స్పందనలను కోరుకుంటున్నారు అని అన్నారు.

భూమిపై కమ్యూనికేషన్లలో సమన్వయం కోసం అవసరం…
నాసా ఆర్టెమిస్‌ కార్యక్రమ లక్ష్యాలకు అనుగుణంగా తాజాగా ఇచ్చిన ఆదేశాలున్నాయి. వ్యోమగాములను పంపడం, చంద్రుడిపై బేస్‌ ఏర్పాటు చేయడం వంటివి దీని లక్ష్యాలు. డేటా ప్రసారంలో, భూమిపై కమ్యూనికేషన్లలో సమన్వయం కోసం సీఎల్‌టీ అవసరం చాలా ఉంది. ప్రస్తుత అంతరిక్ష పరిశోధనల్లో ఓఎస్‌టీపీ మార్గదర్శకాలు కీలక పరిణామంగా చెప్పొచ్చు. చూడాలి… నాసా తయారుచేయబోయే చంద్రుడిపై గడియారం..!

➡️