హాయైన హంస ’కారు‘లోనా..!

Jan 21,2024 12:19 #car, #hamsa

ఇంటర్‌నెట్‌ : హంసలాంటి వాహనం… చూస్తుంటే కళాకారుడు గీసిన అందమైన చిత్రంలా ఉంది కదా..! కానీ.. అది వందేళ్ల కంటే మునుపటి కారు..! అవునండీ… అచ్చంగా కారే..! ఓ దొరకు హంసలా ఉండే కారును చేయించుకోవాలని కోరిక కలిగింది.. ఇంకేముంది వెంటనే ఆర్డర్‌ ఇచ్చేశారు… ‘హైలో హైలెస్సా! హంస కదా నా పడవ!’ అని, హాయైన హంస నావలోన… అంటూ.. ఈ హంస కారులో ఎక్కి వీధుల్లో షికారు కూడా చేశారు..!

బ్రిటిష్‌ హయాం రోజుల్లో 1900 కాలంలో కలకత్తాలో రాబర్ట్‌ నికోల్‌ స్కాటీ మాథ్యూసన్‌ అనే సంపన్న స్కాటిష్‌ దొర ఉండేవారు. ఆయన ఇల్లు కలకత్తా జూ పక్కనే ఉన్న స్వాన్‌ పార్కుకు దగ్గరగా ఉండేది. స్వాన్‌ పార్కులో తిరుగాడే హంసలను రోజూ గమనిస్తూ ఉండే మాథ్యూసన్‌ దొరకి తన కారును అచ్చం హంసలాగానే తయారు చేయించుకోవాలనే కోరిక పుట్టింది.

1910లో సంచలనం.. ఈ హంస కారు..!

1909లో మాథ్యూసన్‌ ఇంగ్లండ్‌కు వెళ్లి హంస ఆకారంలో కారును తయారు చేసేందుకు సఫోల్క్‌లోని లోవెస్టాఫ్ట్‌కు చెందిన జెడబ్ల్యు బ్రూక్‌ అండ్‌ కంపెనీకి ఆర్డర్‌ ఇచ్చారు. 1910లో కలకత్తా చేరిన కారు సంచలనం సృష్టించింది. మాథ్యూసన్‌ కారును కలకత్తాలోని మైదాన్‌ పార్క్‌కి రైడ్‌ కోసం తీసుకువెళ్లారు. ఒక్కోటీ నొక్కితే ఒక్కో వింత ధ్వని వచ్చేది. కారు అడుగుభాగంలో ప్రత్యేకమైన డక్ట్‌ రోడ్డు మీద సున్నం వెదజల్లేది. ఇది అచ్చం హంస రెట్టలా కనిపించేది. ఇంజిన్‌ వేడెక్కినప్పుడు హంస మూతి నుంచి వేడినీళ్లు పిచికారీలా బయటకు వచ్చేవి. ఈ హంస కారులో ఎనిమిది ఆర్గాన్‌ పైపులు, హారన్‌ కోసం సౌండ్‌ ఎఫెక్ట్స్‌ కోసం కీబోర్డ్‌ కూడా ఉన్నాయి. ఈ హంస కారును అంతా అలా చూస్తుండిపోయేవారు..!

ప్రస్తుతం మ్యూజియంలో…

అప్పట్లో మాథ్యూసన్‌ ఈ కారు తయారీ కోసం దాదాపు 15 వేల పౌండ్లు ఖర్చు చేశారు. మాథ్యూసన్‌ దీనిని ఎక్కువకాలం వాడకుండానే అమ్మేయాల్సి వచ్చింది. ఈ కారు పంజాబ్‌లోని సంపన్న బెల్ట్‌లోని ఒక చిన్న రాచరిక రాష్ట్రాన్ని పాలించే నాభా మహారాజా రిపుదమన్‌ సింగ్‌ దృష్టిని ఆకర్షించింది. అతను భారీ మొత్తానికి ఈ కారును కొన్నారు. మహారాజు తన కుటుంబంతో కలిసి ఈ కారులో విహరించేవారు. మహారాజా రిపుదామన్‌ సింగ్‌ను 1923లో బ్రిటీష్‌వారు దుష్పరిపాలన కారణంగా తొలగించారు. అయితే ఆ హంస కారు ఆ తర్వాత ఏడు దశాబ్దాల పాటు నాభా కుటుంబం వద్దనే ఉంది. దీనిని 1990లో నభా రాజకుటుంబం విక్రయించింది. దీన్ని నెదర్లాండ్స్‌లోని లౌమాన్‌ మ్యూజియం కొనుగోలు చేసింది, ఇక్కడ కారు ఇప్పటికీ ప్రదర్శనలో ఉంది.

➡️