అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంగన్‌వాడీల సత్యాగ్రహం

Jan 19,2024 23:36

ప్రజాశక్తి – బాపట్ల
సామాజిక న్యాయం పేరుతో ఓట్ల కోసం పాట్లు పడుతున్న సిఎం జగన్‌ వద్ద అంగన్‌వాడీలకు సామాజిక న్యాయం లేదాని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ మజుందార్‌ ప్రశ్నించారు. అంగన్‌వాడీల సమ్మెలో భాగంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం సత్యాగ్రహం నిర్వహించారు. ఈ సందర్భంగా మజుందార్ మాట్లాడుతూ సామాజిక న్యాయం పేరుతో విజయవాడలో 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్మోహన్‌రెడ్డికి రాష్ట్రంలో 39రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్‌వాడీల సమస్యలు పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఒంటరి మహిళలు
పనిచేస్తున్న అంగన్‌వాడీలు మహిళలుగా కనిపించడం లేదా అన్నారు. అంగన్‌వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ గత మూడు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న అంగన్‌వాడీల ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తోందని అన్నారు. ప్రభుత్వం నుండి స్పందన లేదని, వెంటనే ప్రభుత్వ స్పందించి అంగన్‌వాడీ యూనియన్‌తో చర్చించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీ ఉద్యమం ఈపాటికే రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ ప్రారంభించిందని అన్నారు. త్వరలోనే కోటి సంతకాలతో సిఎంకు సమర్పిస్తామని అన్నారు. అప్పటికీ స్పందించకపోతే రాబోయే కొద్ది రోజుల్లో చలో విజయవాడ నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి జె శామ్యూల్, శరత్, అంగన్‌వాడి యూనియన్ నాయకులు శైలశ్రీ, శ్రీలత, భారతి, పద్మ పాల్గొన్నారు.


పర్చూరు : అంగన్‌వాడిల నిరవధిక సమ్మె స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద కొనసాగిస్తున్నారు. శుక్రవారంకు 39వ రోజుకు చేరింది. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు విధించిన అంగన్‌వాడీల న్యాయమైన కోరికలు సాధించేవరకు సమ్మె కొనసాగిస్తామని సిఐటియు నాయకులు కె శ్రీనివాసరావు హెచ్చరించారు. ప్రభుత్వం పట్టుదల వీడి తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో రైతు సంఘం ఉపాధ్యక్షులు బండి శంకరయ్య, బి చిన్నదాసు, ఎం డేవిడ్, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.


అద్దంకి : అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరించక పోగా ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం, షో కాజు నోటీసులు ఇవ్వటం వంటి బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ అంగన్‌వాడీ కార్యకర్తలు జంకకుండా పోరాటం చేయడం గర్వించదగ్గ విషయమని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంగన్‌వాడీ కార్యకర్తలు సత్యాగ్రహం చేశారు. ప్రభుత్వ తీరు దుర్మార్గమైన దన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు గతంలో ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని పి తిరుపతిరెడ్డి అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు జి శారద, మనోలత పాల్గొన్నారు.


కారంచేడు : స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మె శిభిరాన్ని న్యాయవాదులు సందర్శించారు. అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మెకు న్యాయ సలహాలు ఇచ్చారు. డిమాండ్స్‌ సాధించే వరకు సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. అనేక ఇబ్బందుల మధ్య సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు చేసిన నిర్ణయాన్ని సిఐటియు జిల్లా నాయకులు పి కొండయ్య అభినందించారు. అంగన్‌వాడీల టెర్మినేట్‌పై శిబిరం నుండి పలువురు న్యాయవాదులను సంప్రదించగా ఉద్యోగాలు ఎవరు తీసివేయరని, ధైర్యంగా పోరాడమని న్యాయవాదులు సలహా ఇచ్చినట్లుగా తెలిపారు. దీనితో అంగన్‌వాడీలు మరింత ఉత్సాహంగా సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. కార్యక్రమంలో అంగన్‌వాడి యూనియన్ నాయకులు అనిత, హఫీజ, కళ్యాణి, శ్రీదేవి, శ్రీలక్ష్మి, మేరీ పాల్గొన్నారు.


నిజాంపట్నం : అంగన్‌వాడిల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ అంగన్‌వాడి కార్యకర్తలు శుక్రవారం పొర్లు దండాలు పెట్టారు. అంగన్‌వాడీ యూనియన్ తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం సమ్మె ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీ యూనియన్ మండలం నాయకులు ఉషా మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పండగలప్పుడు కూడా రోడ్డు మీద ఉండి ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం మొండివైఖరి ఆలంబిస్తుందని అన్నారు. రాష్ట్ర రాజధాని కేంద్రంలో 3రోజులు నుండి అంగన్‌వాడి కార్యకర్తలు నిరవదిక నిరాహారదీక్ష చేస్తున్నారని, వారి ఆరోగ్య క్షీణించి ఇబ్బంది పడుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం బాధ్యతారాహిత్యం అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. విధుల్లో నుంచి తొలగిస్తామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామనే రెచ్చగొట్టే చర్యలు వల్ల అంగన్‌వాడీ కార్యకర్తలు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో మద్దతుగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఎన్ శివశంకర్, అంగన్‌వాడీ యూనియన్, సిఐటియు నాయకులు గాయత్రి, రాజేశ్వరి, శ్రీలత, ధనలక్ష్మి పాల్గొన్నారు.


రేపల్లె : అంగన్‌వాడి సమ్మె శిబిరంలో అంబేద్కర్ ఫోటోకు నివాళ్లు అర్పించారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగంలో కార్మికుల హక్కులను కాపాడాలని కోరారు. అంగన్‌వాడిల సమస్యలు పరిష్కారం చేస్తేనే అంబేద్కర్ ఆశయాలు నిరవేరుతునట్లని నిరసన తెలిపారు. అంగన్‌వాడి కార్యకర్తలు ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న 39వ రోజు సమ్మెలో భాగంగా రాష్ట్రంలో అంబేద్కర్ 200 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచిన కార్మిక హక్కులను కాపాడాలని కోరారు. అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించి ఆందోళన చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉంటూ టెర్మినేషన్ నోటీసులను సిద్ధంచేయాలని, కొత్త నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ చేయాలని, అంగన్‌వాడీలను భయభ్రాంతులను చేయటం సిగ్గుచేట్టని అన్నారు. న్యాయమైన అంగన్‌వాడి సమస్యలు పరిష్కారం చేయకుండ అక్రమంగా తొలగించటం అంటే సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్ నాయకులు ఎన్ కృష్ణకుమారి, రజిని, నాగమణి, జయప్రద, శారద, ప్రజాసంఘాలు నాయకులు కెవి లక్ష్మణరావు, కె రమేష్ పాల్గొన్నారు.


చెరుకుపల్లి : టెర్మినేషన్ పేరుతో అంగన్‌వాడీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నప్పటికీ చివరిదాకా పోరాటంలో కొనసాగుతామని అంగన్‌వాడీ కార్యకర్తలు పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చొరవ చూపకుండా భయభ్రాంతులకు గురి చేస్తుందని నిరసన తెలిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని దుయ్యబట్టారు. అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరించినంత ఘనంగా ఆయన ఇచ్చిన రాజ్యాంగం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్యకర్తలు మల్లీశ్వరి, మంగాదేవి, సక్కుబాయి, శిరీష, దానమ్మ పాల్గొన్నారు.

చీరాల : అంగన్‌వాడి సమస్యల పరిష్కారం కోరుతూ తహశీల్దారు కార్యాలయం వద్ద చేస్తున్న నిరసన దీక్షలు శుక్రవారంతో 38వ రోజుకు చేరాయి. సిఐటియు అధ్యక్ష, కార్యదర్శులు ఎం వసంతరావు, ఎన్ బాబురావు మాట్లాడుతూ విజయవాడలో నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్న నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న అంగన్‌వాడీలను ప్రభుత్వం నిర్బంధించిందని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు లక్షల మందిని సమీకరిస్తు అంగన్‌వాడీలను వాళ్ల మీటింగుకు వెళ్ళటానికి ఆటంకం కల్పించటం ఏమిటని ప్రశ్నించారు. సీఎంకు రాజ్యాంగంపై మీద గౌరవం, ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదని అన్నారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని, లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్‌వాడీ కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్‌లో నిర్భందించిన ఈపురుపాలెం పోలీసులు కొద్దిసేపటి తర్వాత విడుదల చేశారని అన్నారు. ధర్నాలో అంగన్‌వాడీ నాయకులు జి సుజీవన, సులోచన, సుప్రభా, అనిత, కృష్ణవేణి పాల్గొన్నారు.


భట్టిప్రోలు : అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరవధిక సమ్మె శుక్రవారంతో 39వ రోజు పూర్తి చేసుకుంది. ప్రభుత్వ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మె శిబిరం నుండి పంచాయతీ కార్యాలయం వద్దగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. సమస్యలు పరిష్కారం అయ్యేవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. సమ్మె విచ్చిన్నానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు మానుకోవాలని పి మనోజ్ కోరారు.

➡️