భవిష్యత్‌ ఉద్యమాలకు దిక్సూచి

Jan 26,2024 22:15 #Anganwadi strike, #successful

-ప్రభుత్వం మాటను నిలబెట్టుకోకుంటే మళ్లీ పోరాటం

-అంగన్‌వాడీల అభినందన సభలో వక్తలు

ప్రజాశక్తి- యంత్రాంగం:వీరోచితంగా సాగిన అంగన్‌వాడీల పోరాటం భవిష్యత్తు ఉద్యమాలకు దిక్చూచిగా, స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పలువురు నేతలు పేర్కొన్నారు. ప్రభుత్వం మాటను నిలబెట్టుకోకుంటే మళ్లీ పోరాటం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్బంధాలకు, అరెస్టులకు, బెదిరింపులకు లంగకుండా 42 రోజులపాటు ఎంతో చారిత్రాత్మకంగా ఉద్యమించి తమ సమస్యలను పరిష్కరించుకున్న అంగన్‌వాడీల అభినందన సభలు విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలోనూ, గుంటూరులోనూ, పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోనూ శుక్రవారం జరిగాయి. ఈ సభల్లో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ ఐక్యతే అంగన్‌వాడీల ఉద్యమానికి బలమన్నారు. వీరి పోరాట విజయం మిగిలిన కార్మికవర్గానికి ఎంతో ఉత్తేజాన్నిస్తుందని పేర్కొన్నారు. ఎస్మాను, నిర్బంధాలను, అక్రమ కేసులను, అరెస్టులను, పోలీసుల దెబ్బలను ఇలా అన్నింటినీ అధిగమించి, ఉద్యమించి విజయం సాధించిన అంగన్‌వాడీలు, వారికి మద్దతునిచ్చిన వారు అభినందనీయులని అన్నారు. నిర్బంధాలను ఎదుర్కొని మొక్కవోని దీక్షతో చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంత మొండిగా వ్యవహరించినా పోరాట పటిమకు తలగ్గక తప్పలేదన్నారు. చర్చల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను వివరించారు. వీటి అమలు కోసం అందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకోకుంటే మళ్లీ పోరాటమే అంగన్‌వాడీల ఆయుధమవుతుందని అన్నారు. సమ్మెకు సంఘీభావం, మద్దతుగా నిలిచిన సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఐసిడిఎస్‌ వ్యవస్థ విస్తరణ, పటిష్టత, ప్రభుత్వ హామీల అమలుకు అంగన్‌వాడీలు సిద్ధంగా ఉండాలన్నారు. తోటి కార్మికుల ఉద్యమాల్లోనూ అంగన్‌వాడీలు భాగస్వాములు కావాలని సూచించారు. విజయవాడ సభలో పౌర సంక్షేమ సంఘాల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్‌ సిహెచ్‌.బాబూరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిర్బంధనాలను సైతం లెక్కచేయకుండా ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరిగే విధంగా పోరాడి విజయం సాధించి అంగన్‌వాడీలు చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షమందికిపైగా అంగన్‌వాడీలు అనేక కష్ట, నష్టాలకోర్చి ఒకే మాట-ఒకే బాటలా సాగడం అభినందనీయమన్నారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.అజరుకుమార్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీల పోరాట పటిమ ఎంతో స్ఫూర్తిదాయమన్నారు. హామీల అమలుకు ఆదేశాలు వెంటనే విడుదల చేయాలి : బేబిరాణిఅంగన్‌వాడీల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు విడుదల చేయాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జి.బేబిరాణి డిమాండ్‌ చేశారు. కాకినాడ కచేరిపేటలోని సిఐటియు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. డిసెంబరు 12న మొదలైన సమ్మె జనవరి 22 అర్ధరాత్రితో ముగిసిందని, దానర్థం పోరాటం ముగిసినట్లు కాదని తాత్కాలిక విరామమేనని స్పష్టం చేశారు. చర్చల సమయంలో తొమ్మిది డిమాండ్లపై నిర్ధిష్టంగా ఆదేశాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించినా తర్వాత సమ్మె విరమించామని తెలిపారు. సమ్మె కాలానికి వేతనాలు చెల్లించేలా, నాయకులు, అంగన్‌వాడీలపై పెట్టిన కేసులు ఎత్తివేసేలా, తొలగించిన వారందరినీ విధుల్లోకి తీసుకొనేలా, గ్రాడ్యుటీపై కేంద్రానికి నివేదించి, జులైలో యూనియన్‌ నాయకులతో చర్చించి ఉభయుల అంగీకారం మేరకు వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. చట్టబద్ధమైన సమ్మెకు రాజకీయరంగు పూలమాలని ప్రయత్నించినా మొక్కవోని దీక్షతో అంగన్‌వాడీలు ఐక్యంగా పోరాడి ప్రభుత్వం మెడలు వంచి విజయం సాధించారని అభినందించారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

➡️