మహిళల ఐక్యతే అభివృద్ధికి సోపానం

Jan 27,2024 01:02

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మహిళలంతా ఐకమత్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి అన్నారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శుక్రవారం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో అంగన్‌వాడీల అభినందన సభ నిర్వహించారు. సభకు యూనియన్ మండల అధ్యక్షురాలు బి రమాదేవి అధ్యక్షత వహించారు. సభలో ఆమె మాట్లాడుతూ ఐక్యంగా ఉంటే దేనినైనా సాధించుకోగలరని అన్నారు. అంగన్‌వాడీల సమస్యలపై 42 రోజులపాటు చేసిన నిరవధిక సమ్మెలో భాగంగా ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చి కొంత మేరకైనా సమస్యలు పరిష్కారం చేసుకోగలిగారని అన్నారు. వేతనాలు జూన్ నెల్లో పెంచుతామని చెప్పినప్పటికీ దానితోపాటు ప్రధానమైన రిటైర్మెంట్ బెనిఫిట్, మట్టి ఖర్చులు, ఆయాలకు పదోన్నతి, ఉద్యోగ విరమణ పెంపుదల వంటి వివిధ రకాల సమస్యలు పరిష్కారం అయ్యాయని అన్నారు. వీటన్నిటిని మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వం జీఒ రూపంలో విడుదల చేసే విధంగా ఒప్పందం జరిగిందని అన్నారు. ఇంతమాత్రానికే పూర్తిస్థాయిలో విజయం సాధించినట్లు కాదని అన్నారు. ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు జరగకపోతే మరో మారు ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అమర్తలూరు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో జరిగిన ఈ సమ్మెలో అంగన్‌వాడీలంతా ఐక్యంగా ఉండి 42రోజులు పాటు పోరాటాలు చేశారని అన్నారు. దీనిలో భట్టిప్రోలు మండలంలో ఉన్న అంగన్‌వాడీలు ఎక్కువ పాత్ర పోషించారని పేర్కొన్నారు. అనంతరం విజయవాడ ధర్నాకు విచ్చేసిన అంగన్‌వాడీలను పోలీసులు అనేక రూపాల్లో వివిధ ప్రాంతాలకు తరలించడం, దానిలో మొక్కఓని దీక్షతో ధైర్యంగా ఎదుర్కొని నిలబడిన పలువురు అంగన్‌వాడీలను షాలువాలతో సత్కరించారు. భారత రాజ్యాంగ పీఠికఫై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి సుధాకర్, టి కృష్ణమోహన్, ఎం సత్యనారాయణ, బి అగస్టీన్, జి నాగరాజు, పి మనోజ్, పల్లికోన, వెల్లటూరు సూర్యలక్ష్మి, గృహలక్ష్మి పాల్గొన్నారు.


చుండూరు : 42రోజులపాటు సమ్మె చేసి సమస్యలను సాధించుకోగలిగిన అంగన్‌వాడీలను శుక్రవారం అభినందించారు. సభలో విజయవాడ ధర్నాకు వెళ్లి అష్ట కష్టాలు పడి సమస్యల పరిష్కారానికి చివరి వరకు నిలబడిన పలువురు అంగన్‌వాడీలను ఐద్వ రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి సన్మానించారు. ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. 42రోజులపాటు చేపట్టిన సమ్మెతో ప్రభుత్వం దిగివచ్చి జూన్లో వేతనాలు పెంచుతానని చెప్పడంతో పాటు మరి కొన్ని సమస్యలను పరిష్కరించి త్వరలో జీవ విడుదలకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోతే మరో మారు ఆందోళన చేపట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి ఆగస్టీన్‌, టి కృష్ణమోహన్ పాల్గొన్నారు.


మార్టూరు రూరల్ : ఐక్య పోరాటాల ద్వారానే విజయం సాధ్యమని అంగన్‌వాడి పోరాటం తెలియజేస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు అన్నారు. అంగన్‌వాడీల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో యద్దనపూడి, మార్టూరు మండలాల పరిధిలోని అంగన్‌వాడీలు స్థానిక తహశీల్దారు కార్యాలయం వద్ద విజయోత్సవ సభ శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మార్టూరు, యద్దనపూడి అంగన్‌వాడీ యూనియన్ నాయకులు తాళ్లూరి రాణి, పల్లెపోగు శ్యామల, నాగ పుష్పరాణి, కుసుమ, జ్యోతి, రాజేశ్వరి, సిహెచ్ జ్యోష్న, వై రత్నకుమారి, నాగరాజ, రమాదేవి, రేవతి, దేవరాణి, హేమలత, ప్రేమానందం పాల్గొన్నారు.

➡️