ఎస్‌బిఐ లాభాలు రూ.9,163 కోట్లు-తగ్గిన మొండి బాకీలు

Feb 3,2024 21:15 #Business

న్యూఢిల్లీ : దేశంలోనే దిగ్గజ విత్త సంస్థ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో రూ.9,163 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 14,205 కోట్ల లాభాలతో పోల్చితే 35 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ కాలంలో 20.40 శాతం పెరుగదలతో రూ.40,378 కోట్ల నికర లాభాలు సాధించింది. 2022-23 తొలి తొమ్మిది మాసాల్లో 33,538 కోట్ల లాభాలు నమోదు చేసింది. 2023 డిసెంబర్‌ ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్‌పిఎ) 3.14 శాతం నుంచి (72 బేసిస్‌ పాయింట్లు) తగ్గి 2.42 శాతానికి తగ్గాయి. నికర నిరర్థక ఆస్తులు 0.77 శాతం నుంచి (13 బేసిస్‌ పాయింట్లు) తగ్గి 0.64 శాతానికి పరిమితమయ్యాయి. గడిచిన క్యూ3లో ఎస్‌బిఐ నికర వడ్డీ ఆదాయం (ఎన్‌ఐఐ) రూ.39,815 కోట్లుగా నమోదయ్యింది. క్రితం క్యూ3లో రూ.5,046 కోట్ల మొండి బాకీలు చోటు చేసుకున్నాయని ఎస్‌బిఐ ఛైర్మన్‌ దినేష్‌ కుమార్‌ ఖారా పేర్కొన్నారు. ఏడాదికేడాదితో పోల్చితే రికవరీ 9.4 శాతం పెరిగి రూ.1,798 కోట్లుగా నమోదయ్యాయన్నారు. కాగా.. ఎస్‌ఎంఇ రుణాల్లో ఎక్కువగా ఎన్‌పిఎలు చోటు చేసుకున్నాయని తెలిపారు. అయినప్పటికీ పెద్ద ఆందోళకరమేమీ కాదన్నారు. వన్‌ టైం పెన్షన్‌ కోసం రూ.7,100 కోట్లు కేటాయించడంతో లాభాలు తగ్గాయని తెలిపారు. గడిచిన క్యూ3లో బ్యాంక్‌ అడ్వాన్సులు 14.38 శాతం పెరిగి రూ.35.84 లక్షల కోట్లకు చేరాయి. ముఖ్యంగా వ్యక్తిగత, ఎస్‌ఎంఇ రుణాల్లో పెరుగుదల చోటు చేసుకుంది. మొత్తం డిపాజిట్లు 13.02 శాతం వృద్థితో రూ.47.62 లక్షల కోట్లకు చేరాయి. క్రితం క్యూ3తో పోల్చితే ప్రస్తుత జనవరి – మార్చి త్రైమాసికం రుణాలు అధిక వృద్థి ఉండొచ్చని ఖారా తెలిపారు.

➡️