న్యూజివీడ్‌ సీడ్స్‌కు 50 ఏళ్లు

Jan 30,2024 21:30 #Business

30 శాతం వృద్థి లక్ష్యం

న్యూజివీడ్‌ సీడ్స్‌ సిఎండి వెల్లడి

ఆర్‌అండ్‌డికి 5 శాతం నిధులు

ప్రజాశక్తి – బిజినెస్‌ బ్యూరో :వచ్చే ఐదేళ్లలో న్యూజివీడ్‌ సీడ్స్‌ కంపెనీ విత్తన అమ్మకాల్లో 30 శాతం వృద్థిని అంచనా వేస్తున్నామని ఎన్‌ఎస్‌ఎల్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం ప్రభాకర్‌ రావు అన్నారు. న్యూజివీడ్‌ సీడ్స్‌ను ప్రారంభించి.. ఈ ఏడాదితో 50 ఏళ్లు కావస్తుందన్నారు. ఈ సందర్బంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ చీఫ్‌ స్ట్రాటజిక్‌ ఆఫీసర్‌ షరద్‌ ఖురానా, హోల్‌ టై డైరెక్టర్‌ పి సతీష్‌ కుమార్‌, చీఫ్‌ ఫైనాన్సీయల్‌ ఆఫీసర్‌ వి శ్రీకాంత్‌తో కలిసి ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ.. గడిచిన 2022-23లో 15 శాతం పెరుగుదలతో రూ.1100 కోట్ల టర్నోవర్‌ నమోదు చేశామని.. విత్తన కొరత వల్ల ఈ ఏడాది కూడా అదే స్థాయిలో వ్యాపారం జరగవచ్చన్నారు. కానీ వచ్చే ఐదేళ్ల పాటు 30 శాతం వృద్థి చోటు చేసుకోవచ్చన్నారు. భారత విత్తన రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. తమ సంస్థ ఏడాదికి కోటి పత్తి విత్తనాల ప్యాకెట్లను విక్రయిస్తుందన్నారు. తమ మొత్తం వ్యాపారంలో ఈ విభాగం 46 శాతం వాటా కలిగి ఉందన్నారు. సంస్థ మొత్త రెవెన్యూలో 5 శాతం పరిశోధన, అభివృద్థికి కేటాయిస్తున్నామన్నారు. గడిచిన నాలుగైదు ఏళ్లలో 3.4 కొత్త ఉత్పత్తులు తీసుకొచ్చామన్నారు. ఒక్క కొత్త విత్తనాన్ని అభివృద్థి చేయడానికి ఏడేనిమిది ఏళ్లు పడుతుందన్నారు. ప్రతీ ఏడాది 50 లక్షల రైతులకు తాము సేవలందిస్తున్నామన్నారు. విత్తన ఉత్పత్తిలో మరో లక్ష మంది రైతులతో భాగస్వామ్యం కలిగి ఉన్నామన్నారు. వచ్చే నాలుగైదు ఏళ్లలో రెట్టింపు పత్తి విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రస్తుతం కోటి ప్యాకెట్లు విక్రయిస్తున్నామన్నారు. ప్రపంచ విత్తన రంగం ప్రతీ ఏడాది సగటున 5 శాతం పెరుగుదలను నమోదు చేస్తే.. భారత్‌ 10 శాతం వృద్థిని సాధిస్తుందన్నారు. తమ సంస్థ పరిశ్రమ కంటే దాదాపు రెట్టింపు వృద్థితో కొనసాగుతుందన్నారు.

➡️