మార్కెట్లపై బేర్‌ పంజా

Dec 20,2023 21:10 #Business

సెన్సెక్స్‌ 931 పాయింట్ల పతనం

ముంబయి : అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు కుప్పకూలాయి. బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం వరకు సానుకూలంగా రాణించినప్పటికీీ.. ఆ తర్వాత ఒక్క సారిగా పతనం వైపు మళ్లాయి. అన్ని రంగాల షేర్లు ఒత్తిడికి గురి కావడంతో చివరి రెండు గంటల్లో భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. తుదకు బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 931 పాయింట్లు లేదా 1.3 శాతం క్షీణించి 70,506కు పడిపోయింది. ఇంట్రాడేలో 71,913-70,303 పాయింట్ల మధ్య కదలాడింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 303 పాయింట్లు కోల్పోయి 21,150 వద్ద ముగిసింది. దీంతో మార్కెట్లు 2023 అక్టోబర్‌ తర్వాత అతిపెద్ద ఒకరోజు నష్టాన్ని నమోదు చేశాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన సూచీలకు.. అంతర్జాతీయ ప్రతికూల అంశాలు అమ్మకాలకు పురిగొల్పాయని నిపుణులు పేర్కొంటున్నారు. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.18 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌-30 సూచీలో ఒక్క హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ మినహా, నిఫ్టీ 50లో 46 స్టాక్స్‌ నష్టాలను చవి చూశాయి. టాటా స్టీల్‌, ఎన్‌టిపిసి, టాటా మోటార్స్‌, హెచ్‌సిఎల్‌ టెక్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బిఐ, పవర్‌గ్రిడ్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టి స్టాక్స్‌ అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. నిఫ్టీలో మీడియా సూచీ 5.11 శాతం, పిఎస్‌యు బ్యాంకింగ్‌ సూచీ 4 శాతం, లోహ సూచీ 3.8 శాతం, రియాల్టీ 2.43 శాతం చొప్పున పతనమయ్యాయి.

➡️