వ్యాపారాలు కుంటుపడకుండా చర్యలుండాలి

Mar 23,2024 21:05 #Business

జిఎస్‌టి అధికారులు విచక్షణ పాటించాలి
సుప్రీంకోర్టు న్యాయమూర్తి భుయాన్‌
సున్నితంగా పన్ను వసూళ్లు చేయాలి
టిఎస్‌ హైకోర్టు సిజె అలోక్‌ ఆరాధే
హైదరాబాద్‌ : వ్యాపారాలు కుంటుపడని విధంగా జిఎస్‌టి అధికారులు తమ అధికారాలను ఉపయోగించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్‌ భుయాన్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఎఫ్‌టిసిసిఐ కార్యాలయంలో జాతీయ పన్ను సదస్సును నిర్వహించారు. తెలంగాణ ట్యాక్స్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఎఫ్‌టిసిసిఐ) మద్దతుతో 49 ఏళ్ల ఆల్‌ ఇండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ టాక్స్‌ ప్రాక్టీషనర్స్‌ (ఎఐఎఫ్‌టిపి) సౌత్‌ జోన్‌ దీన్ని నిర్వహించింది. దీనికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి న్యాయమూర్తి ఉజ్జల్‌ భుయాన్‌, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్‌ ఆరాధే పాల్గని మాట్లాడారు. ఎనిమిది ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
న్యాయమూర్తి ఉజ్జల్‌ భుయాన్‌ ప్రారంభోపన్యాసం చేశారు. తన వ్యక్తిగత అనుభవాలను, సెక్షన్‌ 69 కింద జిఎస్‌టి అరెస్ట్‌ నిబంధనలు, జిఎస్‌టి చట్టంలోని సెక్షన్‌ 83 కింద ఆస్తుల అటాచ్‌మెంట్‌ నిబంధనలపై పలు మైలురాయి తీర్పులను ఆయన పంచుకున్నారు. దేశంలోని ఏ కోర్టు కూడా అరెస్టయిన వారికి బెయిల్‌ ఇవ్వనప్పటికీ, ఒక వ్యక్తిని అరెస్టు చేసే అధికారం ఉన్న అధికారులు ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి ముందు కారణాన్ని కూడా నమోదు చేయాలనే సూత్రం ఆధారంగా మేము బెయిల్‌ మంజూరు చేశామన్నారు. జిఎస్‌టి చట్టంలోని సెక్షన్‌ 69 మరియు 83తో పోల్చితే మనీలాండరింగ్‌ నిరోధక చట్టం 2002 (పిఎమ్‌ఎల్‌ఎ) నిబంధనను ఆయన గుర్తు చేశారు. అధికారులకు ఇచ్చిన ఈ కఠినమైన చట్ట నిబంధనలు వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. వ్యాపారం కుంటుపడకుండా అధికారాన్ని విచక్షణతో వినియోగించుకోవాలని భుయాన్‌ పేర్కొన్నారు.
న్యాయమూర్తి అలోక్‌ ఆరాధే మాట్లాడుతూ.. ”పన్ను అనేది పౌర సమాజానికి కీలకమైన స్తంభమని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని నడపడానికి ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. ఇది సమాజం యొక్క సామాజిక, ఆర్థిక వృద్థిని నెరవేరుస్తుంది. పన్ను అనేది విస్తారమైన అంశం. ఇది సంక్లిష్టమైనది. వేగంగా మారుతున్నది. చాణక్యుడు చెప్పిన విధంగా తేనెటీగలు పువ్వుల నుండి తేనెను సేకరిస్తున్నట్లుగా, సున్నితంగా, నొప్పిని కలిగించకుండా పౌరుల నుండి పన్నులు తప్పనిసరిగా వసూలు చేయాలని అన్నారు. అధికారులు సామూహిక వివేకాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఎఫ్‌టిసిసిఐ ప్రెసిడెంట్‌ మీలా జయదేవ్‌ మాట్లాడుతూ.. మారుతున్న చట్టాల్లోని పరిణామాలతో పన్నుల గురించిన చట్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడమే ఈ సదస్సు అని అన్నారు. అనేక రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో జిఎస్‌టి టర్నోవర్‌ పరిమితిని రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచాలని ఎఫ్‌టిసిసిఐ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ కార్యక్రమంలో కాన్ఫరెన్స్‌ కమిటీ చైర్మన్‌ నాగేష్‌ రంగి, ఎఐఎఫ్‌టిపి నేషనల్‌ ప్రెసిడెంట్‌ నారాయన్‌ పి జైన్‌, తెలంగాణ ట్యాక్స్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కె నర్సింగరావు, ఎఐఎఫ్‌టిపి సౌత్‌ జోన్‌ చైర్మన్‌ రామరాజు శ్రీనివాస్‌ తదితరులు పాల్గోన్నారు.

➡️