అమూల్‌ సంకటం !

Jul 1,2024 09:32 #Amul, #Trouble

– నాడు జగన్‌ ప్రభుత్వాన్ని దుయ్యబట్టిన టిడిపి
– ఇప్పుడు మోడీ, అమిత్‌షాకు కోపం వస్తుందన్న మిమాంస
– గుజరాత్‌ సంస్థ వద్దంటున్న ‘దేశం’ నేతలు
– తమిళనాడు, కర్ణాటకలో ప్రతిఘటన
– ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలంటున్న పాడి రైతులు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : గుజరాత్‌కు చెందిన పాలు, పాల ఉత్పత్తుల వ్యాపార దిగ్గజం అమూల్‌ సంస్థను గత వైసిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోనికి ప్రవేశపెట్టగా, తాజాగా రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన టిడిపి కూటమి సర్కారు వైఖరేంటనే విషయంపై పాడి రైతుల్లో చర్చ మొదలైంది. డెయిరీ రంగంలో బలంగా ఉన్న సహకార సంస్థలకు నష్టం కలిగించేలా, ప్రభుత్వ రంగంలో ఉన్న ఎపి డెయిరీకి చెందిన విలువైన భూములను, స్థిర, చరాస్తులను అమూల్‌కు ధారాదత్తం చేసేందుకు నాటి వైసిపి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. అమూల్‌కు, ఎపి డెయిరీకి మధ్య 2020 జులై 21న పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఒయు) కుదిరింది. అగ్రిమెంట్‌ రోజునే ఎపి డెయిరీ, అమూల్‌ వ్యాపార భాగస్వామ్యంపై గైడ్‌లైన్స్‌ విడుదల చేస్తూ జిఒఎంఎస్‌ నెం.25 జారీ అయింది. కాగా అమూల్‌ ఒప్పందాన్ని నాడు ప్రతిపక్షంలో ఉన్న టిడిపి తీవ్రంగా తప్పుబట్టింది. రోడ్డెక్కి ఆందోళనలు కూడా నిర్వహించింది. గుజరాత్‌కు జగన్‌ సర్కారు అమ్ముడుపోయిందని అచ్చెన్నాయుడు వంటి వారు తీవ్రంగా ధ్వజమెత్తారు. తెలుగు జాతి గౌరవాన్ని దెబ్బతీశారని చంద్రబాబుతో సహా పలువురు టిడిపి నేతలు విమర్శించారు. అయితే ఎన్నికల్లో టిడిపి-జనసేన-బిజెపి కూటమి ఎ.పి.లో అధికారంలోకొచ్చిన తరుణంలో నాడు అమూల్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన టిడిపి ఏం చేస్తుంది, గత సర్కారు చేసుకున్న ఎంఒయును రద్దు చేస్తుందా, లేక కొనసాగిస్తుందా, అదీ కాకపోతే తాత్కాలికంగా అమూల్‌ ప్రాజెక్టును నిలిపివేస్తుందా అనే ప్రశ్నలు పాడి రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, అమూల్‌ వ్యవహారం రాజకీయంగా ముడిపడి ఉందని, బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎలో టిడిపి భాగస్వామి అయినందున, ఇక్కడా తమది ఎన్‌డిఎ ప్రభుత్వమని ప్రకటించుకున్నందున, అమూల్‌తో తెగదెంపులు చేసుకోవడం అంత ఈజీ కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
న్యాయస్థానాల దాకా..
వైసిపి ప్రభుత్వం 2020 మధ్యలో రాష్ట్రంలోకి అమూల్‌ను ప్రవేశపెట్టినప్పటికీ అన్ని జిల్లాలకూ ప్రతిపాదిత ‘పాలవెల్లువ’ ప్రాజెక్టు విస్తరించలేదు. ఎంఒయు వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లింది. ఎపి డెయిరీ, అమూల్‌ రెండూ కలిసి పని చేయాలన్నది ఎంఒయు టార్గెట్‌. కొన్ని దశాబ్దాలలో లక్షలాది పాడి రైతులు సమిష్టిగా కూడబెట్టిన ఎపి డెయిరీ భూములను, మౌలిక సదుపాయాలను, మార్కెటింగ్‌ వనరులను అమూల్‌కు కారు చవకగా కట్టబెట్టడమే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ప్రాజెక్టు నడిచింది. ఉదాహరణకు చిత్తూరు జిల్లా యూనిట్‌ భూములను 99 ఏళ్ల లీజుపై అమూల్‌కు కట్టబెట్టారు. చిత్తూరు, ప్రకాశం, కడప, గుంటూరు జిల్లాల్లోనే పాల సేకరణ, ప్రాసెసింగ్‌, మార్కెటింగ్‌ నడిచాయి. ఆర్‌బికెలలో బల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు, సేకరణ కేంద్రాలన్నా కొన్ని ఆర్‌బికెలకే పరిమితమయ్యాయి. అమూల్‌ సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్‌ ఎత్తుగడలపై అధ్యయనం చేస్తుందని చెప్పినా పెద్దగా వర్కవుట్‌ కాలేదు.
ముట్టుకుంటే కాలుతుంది…
గుజరాత్‌ కోాఆపరేటివ్‌ మిల్క్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ (జిసిఎంఎంఎఫ్‌ాఅమూల్‌) సహకార రంగంలోనిదైనప్పటికీ ఆ రాష్ట్రానికి పరిమితం కాకుండా కార్పొరేట్‌ సంస్థ వలే మార్చేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తోంది. సహకార రంగం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాగా కేంద్రం సహకార వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే హోంమంత్రి అమిత్‌షాకు కేంద్రంలో సహకార శాఖను మోడీ సర్కారు అప్పగించింది. మల్టీ స్టేట్‌ కోాఆపరేటివ్స్‌ చట్టాన్ని ముందుకు తెచ్చి అన్ని రాష్ట్రాల్లోనూ వ్యాపారం చేసుకునేందుకు మార్గం వేసింది. దక్షిణాదిలోని కర్ణాటక, తమిళనాడుకు అమూల్‌ను విస్తరించేందుకు ప్రయత్నాలు చేయగా అక్కడి ప్రజలు, ప్రభుత్వాలు ప్రతిఘటించాయి. మన రాష్ట్రంలో మాత్రం గత వైసిపి సర్కారు, మోడీ, అమిత్‌షా ఒత్తిళ్లతో అమూల్‌కు సాదరంగా స్వాగతం పలికింది. అయితే నాడు జగన్‌ సర్కారును దుయ్యబట్టిన టిడిపి, ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక అమూల్‌పై ఆచితూచి అడుగులేస్తోంది. ఎన్‌డిఎలో ఉన్నందున అమూల్‌ జోలికెళితే మోడీకి, అమిత్‌షాకు కోపం వస్తుందని ఆలోచిస్తోంది. కాగా, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌, మరికొందరు టిడిపి నాయకుల చేతుల్లో ఉన్న సహకార, ప్రైవేటు డెయిరీలను దెబ్బ కొట్టేందుకు జగన్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అమూల్‌ను తీసుకొచ్చిందన్న అభిప్రాయం టిడిపి నేతల్లో బలంగా ఉంది. తమ వ్యాపారాలను, ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు అమూల్‌ను జగన్‌ అస్త్రంగా వాడుకున్నారని, అధికారంలోకి వచ్చాం కనుక అమూల్‌పై కఠినంగా వ్యవహరించాలన్నది పలువురు టిడిపి నేతల మాట. తమకు అండగా నిలబడిన నాయకుల, సానుభూతిపరుల డిమాండ్‌ ఒకవైపు, రాజకీయంగా బిజెపితో ఉన్న పొత్తు సంబంధాలు మరోవైపు అమూల్‌ విషయంలో అడుగు ముందుకేయలేని సంకట పరిస్థితిని టిడిపికి కల్పించాయని తెలుస్తోంది.

➡️