15 కోట్ల మార్క్‌కు డిమ్యాట్‌ ఖాతాలు

Apr 6,2024 21:05 #Business

ఏడాదిలో కొత్తగా 3.5 కోట్ల ఎకౌంట్స్‌ జారీ
న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023ా24)లో రికార్డ్‌ స్థాయిలో కొత్తగా 3.7 కోట్ల డిమ్యాట్‌ ఖాతాలు తెరిచారు. అంతక్రితం ఏడాదితో పోల్చితే 32 శాతం అధికం. స్టాక్‌ మార్కెట్‌లో నేరుగా పెట్టుబడులపై ఆసక్తులు పెరగడంతో భారీ సంఖ్యలో కొత్త ఖాతాలు నమోదవుతున్నాయి. 2024 మార్చి ముగింపు నాటికి దేశంలో మొత్తం డీమ్యాట్‌ ఖాతాలు 15 కోట్లు దాటి నూతన మైలురాయిని చేరుకున్నాయి. ఈక్విటీ మార్కెట్ల నుంచి ఆకర్షణీయ రాబడులను పొందవచ్చనే ఆలోచనలతో అనేక మంది డిమ్యాట్‌ ఖాతాలను తెరిచారు. గడిచిన ఏడాది కాలంలో సగటున ప్రతి నెలా 30 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్‌ ఖాతాలు నమోదయ్యాయి. 2020ా21లో 1.4 కోట్ల కొత్త డిమ్యాట్‌ ఖాతాలు తెరుబడ్డాయి.
దేశంలో సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సిడిఎస్‌ఎల్‌), నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌డిఎల్‌)లు డిమ్యాట్‌ ఖాతాలను తెరవడం, నిర్వహించడం చేస్తున్నాయి. గడిచిన ఏడాదిలో ఈ సంస్థలు వరుసగా 11.9 శాతం, 15.14 శాతం పెరుగుదలను సాధించాయి. 2023 మార్చి ముగింపు నాటికి దేశంలో ఈ రెండు సంస్థలు కలిసి 11.45 కోట్ల డిమ్యాట్‌ ఖాతాలను అందించాయి. భారత మార్కెట్లపై పలు ఎజెన్సీలు అంచనాలు పెంచడం, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెరగడం, ఈక్విటీలపై యువత ఆసక్తి, పలు కంపెనీలు ఐపిఒలకు రావడం తదితర అంశాలు డిమ్యాట్‌ ఖాతాల పెరుగుదలకు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023-24లో ఐపిఒల ద్వారా ద్వారా 76 కంపెనీలు రూ.61,921 కోట్ల నిధులు సమీకరించాయి. అదే ఏడాది సెన్సెక్స్‌ నిఫ్టీలు వరుసగా 24.85 శాతం, 28.61 శాతం చొప్పున రిటర్న్‌లను అందించాయి. బిఎస్‌ఇ మిడ్‌ క్యాప్‌ సూచీ 63.4 శాతం, స్మాల్‌ క్యాప్‌ 60 శాతం చొప్పున పెరిగాయి.

➡️