ఫ్లిప్‌కార్ట్‌ నుంచి బిన్నీ బన్సల్‌ అవుట్‌

Jan 28,2024 09:21 #Business

వాల్‌మార్ట్‌ చేతికి మిగితా వాటాలు

న్యూఢిల్లీ : ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సల్‌ ఆ సంస్థ నుంచి పూర్తిగా వైదొలిగారు. ఆయన వాటాలను పూర్తిగా అమెరికన్‌ సంస్థ వాల్‌మార్ట్‌ ఇండియా స్వాధీనం చేసుకుంది. 2007లో బిన్నీ బన్సల్‌, సచిన్‌ బన్సల్‌ కలిసి బెంగళూరులో ఫ్లిప్‌కార్ట్‌ను స్థాపించారు. 2018లో ఫ్లిప్‌కార్ట్‌లోని 77 శాతం మెజారిటీ వాటాలను 16 బిలియన్‌ డాలర్ల (రూ.1.30 లక్షల కోట్లు)కు వాటాలను కొనుగోలు చేసింది. ఆ తర్వాత బన్సల్‌కు ఇందులో 1-1.8 శాతం మాత్రమే వాటాలు మిగిలాయి. ఆ వాటాలను కూడా తాజాగా వాల్‌మార్ట్‌ 1-1.5 బిలియన్‌ డాలర్లు (రూ.8వేలా12వేల కోట్లు)తో కొనుగోలు చేసిందని సమాచారం. బిన్నీ బన్సల్‌ ఇప్పటి వరకు దాదాపు 92 సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. అందులో అక్నో, అన్‌అకాడమీ, యులు లాంటి సంస్థలున్నాయి. ”గడిచిన 16 ఏళ్లలో ఫ్లిప్‌కార్ట్‌ అనేక లక్ష్యాలను సాధించింది. అందులో నా భాగస్వామ్యం ఉండటం గర్వంగా ఉంది. ప్రస్తుత నాయకత్వ బృందం మున్ముందు కూడా అనేక విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.” అని బిన్నీ బన్సల్‌ పేర్కొన్నారు. బన్సల్‌ జనవరి 2న ఓప్‌డోర్‌ పేరుతో కొత్త ఇ-కామర్స్‌ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నెలకొన్న విభేదాల వల్ల ఫ్లిప్‌కార్ట్‌ బోర్డుకు బన్సల్‌ రాజీనామా చేశారని సమాచారం. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పేలోనూ బన్సల్‌ పెట్టుబడులు ఉన్నాయి.

➡️