పడకేసిన మౌలిక వసతుల రంగాలు

Apr 30,2024 21:41 #Business
  •  మార్చిలో 5.2 శాతానికి పతనం
  •  మైనస్‌లో రిఫైనరీ, ఎరువుల ఉత్పత్తి

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనం స్పష్టమవుతోంది. అత్యంత కీలకమైన ఎనిమిది మౌలిక వసతుల రంగాల ఉత్పత్తి పడకేసింది. ప్రస్తుత ఏడాది మార్చిలో మౌలిక వసతుల రంగాలు ఉత్పత్తి పెరుగుదల 5.2 శాతానికి పడిపోయింది. ఇంతక్రితం ఫిబ్రవరిలో ఇవి 7.1 శాతంగా వృద్థిని నమోదు చేయగా.. వరుసగా ఐదో మాసంలోనూ కీలక రంగాలు నేల చూపులు చూడటం గమనార్హం.
వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి స్థూలంగా 7.5 శాతానికి పడిపోయింది. 2022-23లో 7.8 శాతం వృద్థిని కనబర్చాయి. క్రితం ఆర్థిక సంవత్సరంలో ఉక్కు 12.3 శాతం వృద్థితో ప్రగతిని కనబర్చింది. బొగ్గు (11.7 శాతం), సిమెంట్‌ (9.1 శాతం), విద్యుత్‌ (7శాతం) రంగాలు రాణించాయి. గడిచిన మార్చి మాసంలో బొగ్గు (8.7 శాతం), ముడి చమురు (2 శాతం), సహజ వాయువు (6.3 శాతం), ఉక్కు (5.5 శాతం) వంటి రంగాల్లో ఉత్పత్తి క్షీణించింది. రిఫైనరీ ఉత్పత్తులు ఏకంగా మైనస్‌ 0.3 శాతం, ఎరువులు మైనస్‌ 1.3 శాతం చొప్పున క్షీణించాయి. సిమెంట్‌ (10.6 శాతం), విద్యుత్‌ (8 శాతం) రంగాలు మాత్రమే ప్రగతిని కనబర్చాయి. ఈ ఎనిమిది రంగాలు మొత్తం దేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 40.27 శాతం వాటా కలిగి ఉన్నాయి.

➡️