ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ సిఎండి నారాయణన్‌ కన్నుమూత

May 18,2024 21:00 #Business, #icic bank

చెన్నయ్ : ఐసిఐసిఐ బ్యాంక్‌ మాజీ ఛైర్మన్‌ నారాయణన్‌ వఘుల్‌ శనివారం మరణించారు. నారాయణన్‌ చెన్నరులో కన్ను మూశారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. గురువారం ఇంట్లో పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి జారిపోయిన ఆయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌ మద్దతుతో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. 88 ఏళ్ల వయసు కలిగిన వఘుల్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఐసిఐసిఐ బ్యాంక్‌ ప్రయివేటీకరణలో నారాయణన్‌ కీలక పాత్ర పోశించారు. ఆ బ్యాంక్‌కు 24 ఏళ్ల పాటు ఛైర్మన్‌గా, సిఇఒగా పని చేశారు. నారాయణన్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో తొలుత కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తరువాత 44 ఏళ్ల వయసులో 1981లో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌గా నియమితులై ప్రభుత్వ రంగ బ్యాంక్‌కు అతి పిన్న వయస్కుడైన ఛైర్మన్‌గా గుర్తింపు పొందారు. 1984 వరకు ఆయన అదే హోదాలో ఉన్నారు. 1985లో అప్పటి ప్రధాని రాజీవ్‌ గాంధీ ఐసిఐసిఐ లిమిటెడ్‌ సిఎండిగా నియమించారు. 1995లో ఆ బ్యాంక్‌ ప్రయివేటీకరణలో ప్రధాన పాత్ర పోశించడంతో పాటుగా 2009 పదవి విరమణ వరకు అందులోనే కొనసాగారు. వాణిజ్యం, పరిశ్రమలకు చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2009లో పద్మభూషణ్‌తో సత్కరించింది.

➡️