బంగారం @రూ.75వేలు..!

Apr 12,2024 21:30 #Business

కొనడం కష్టమే..
న్యూఢిల్లీ : బంగారం ధర రాకేట్‌ కంటే వేగంగా పెరుగుతోంది. సామాన్యుడు కొనలేని స్థాయికి చేరింది. పది గ్రాముల బంగారం ధర పన్నులతో కలుపుకుని ఏకంగా రూ.75వేల మార్క్‌ను తాకింది. ఒక్క పూటలోనే వెయ్యి రూపాయలు పెరిగింది. వెండి గ్రాము ధర రూ.900కు ఎగిసింది. గుడ్‌ రిటర్న్స్‌ ప్రకారం.. శుక్రవారం న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.1,090 పెరిగి రూ.73,310కు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,000 ఎగిసి రూ.67,200 వద్ద నమోదయ్యింది. దీనికి 3 శాతం జిఎస్‌టి అదనం. కిలో వెండిపై రూ.1,500 పెరిగి రూ.90,000గా నమోదయ్యింది.
అంతర్జాతీయంగా పసిడికి గిరాకీ పెరగడంతో ధరలు ఎగుస్తున్నాయని హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు (32 గ్రాములు) బంగారం ధర 2,388 డాలర్ల వద్ద నమోదవుతోంది. సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఎప్పుడైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేయొచ్చన్న వార్తలు పసిడికి మరింత డిమాండ్‌ను పెంచింది.

➡️