మార్చిలో రూ.1.78 లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లు

Apr 1,2024 21:14 #Business, #GST, #march

న్యూఢిల్లీ : దేశంలో అమాంతం పెరిగిన పన్ను వసూళ్లు ప్రభుత్వ ఖజానాను నింపివేస్తున్నాయి. వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు మరోమారు భారీగా నమోదయ్యాయి. ప్రస్తుత ఏడాది మార్చిలో ఏకంగా రూ.1.78 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ఇంతక్రితం ఏడాది ఇదే నెల వసూళ్లతో పోల్చితే 11.5 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. జిఎస్‌టి అమల్లోకి వచ్చిన తర్వాత 2023 ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.87 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. ఆ తర్వాత గడిచిన నెలలో మరోమారు రికార్డ్‌ జిఎస్‌టి వసూళ్లయ్యింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో జిఎస్‌టి రాబడి మొత్తంగా 11.7 శాతం పెరిగి రూ.20.14 లక్షల కోట్లుగా ఉంది. ప్రతీ నెల సగటున రూ.1.68 లక్షల కోట్ల రాబడి ఉంది. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల కోట్ల సగటు చోటు చేసుకుంది. గడిచిన మార్చి మొత్తం వసూళ్లలో సిజిఎస్‌టి వాటా రూ.34,532 కోట్లుగా, ఎస్‌జిఎస్‌టి వాటా రూ.43,746 కోట్లుగా, ఐజిఎస్‌టి కింద రూ.87,947 కోట్లుగా నమోదయ్యింది. సెస్సుల రూపంలో మరో రూ.12,259 కోట్లు వచ్చింది. తెలంగాణలో గతేడాది మార్చిలో రూ.4804 కోట్ల వసూళ్లు జరగ్గా.. గడిచిన నెలలో 12 శాతం వృద్థితో రూ.5,399 కోట్లకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో గతేడాది మార్చిలో రూ.3,532 కోట్లుగా ఉన్న జిఎస్‌టి వసూళ్లు.. గడిచిన నెలలో 16 శాతం పెరిగి రూ.4082 కోట్లుగా నమోదయ్యాయి.

➡️