పేటియం ఉద్యోగులకు కొత్త ఏడాది షాక్‌

Dec 25,2023 20:41 #Business, #paytm
  • 1000 మందిపై వేటు..15 శాతం వ్యయం తగ్గింపు..!
  • నైక్‌లోనూ ఉద్వాసనలు..

ముంబయి : టెక్నాలాజీ, స్టార్టప్‌ కంపెనీలపై ఆశలు పెట్టుకున్న, ఆధారపడిన ఉద్యోగుల బ్రతుకులకు భద్రత లేకుండా పోతోంది. తాజాగా ప్రముఖ పిన్‌ టెక్‌ కంపెనీ పేటియం మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ భారీగా ఉద్యోగులను ఇంటికి పంపించింది. పేటియంలో పని చేస్తున్న దాదాపు 1,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 10-15 శాతం మందిపై ప్రభావితం చూపనుందని సమాచారం. వ్యయ నియంత్రణ చర్యలల్లో భాగంగా సిబ్బందిని ఇంటికి పంపించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పేటియం తన వ్యాపారాలను పునర్‌ వ్యవస్థీకరించాలనే ఉద్దేశ్యంతో కోతలు విధించినట్లు ఆ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. భవిష్యత్‌లో మరిన్ని వ్యయ నియంత్రణ చర్యలూ ఉంటాయని సంకేతాలు ఇవ్వడంతో మిగిలిన ఉద్యోగుల్లోనూ తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. తాజా ఉద్వాసనలతో మొత్తంగా ఉద్యోగులపై చేస్తున్న వ్యయంలో 10-15 శాతం తగ్గించుకోవాలని సంస్థ లక్ష్యంగా చేసుకుంది. ఇటీవల రిటైల్‌ రుణాల జారీని తగ్గించుకోవడం, యుపిఐ ప్లాట్‌ఫామ్‌పై ‘ఇప్పుడు కొనండి తర్వాత చెల్లించండి’ రుణాలను నిలిపివేయడం వంటి చర్యల తర్వాత సిబ్బంది తొలగింపు నిర్ణయం వెలుపడింది. కాగా.. గతేడాది వ్యవధిలో భారీ వృద్థి నమోదు చేసిన రుణ విభాగం నుంచే అత్యధిక తొలగింపులు ఉన్నట్లు సమాచారం. రూ.50 వేల లోపు రుణాల జారీని ఇటీవల నిలిపివేసింది. ఈ పరిణామంతో వన్‌ 97 కమ్యూనికేషన్‌ సూచీ ఇటీవల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది.

ఈ ఏడాది తొలి మూడు త్రైమాసికాల్లో వివిధ నూతన టెక్‌ కంపెనీలు దాదాపు 28,000 మంది ఉద్యోగులను తొలగించాయని లాంగౌజ్‌ కన్సల్టెంగ్‌ పరిశోదన సంస్థ అంచనా వేసింది. 2022లోనూ 20వేల పైగా ఉద్యోగులు పోయాయి. 2021లో 4,000 మంది సిబ్బంది రోడ్డున పడ్డారు. నోట్ల రద్దు సమయంలో పేటియంకు ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా బ్రాండ్‌ అంబాసీడర్‌గా వ్యవహారించారనే విమర్శలు ఉన్నాయి. అలాంటి సంస్థలో ఇప్పుడు వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడుతుంటే కేంద్రం ఏమి పట్టనట్టు ఉండటం విశేషం. గడిచిన నెల రోజుల్లో పేటియం షేర్‌ విలువ 27.77 శాతం లేదా రూ.246.75 క్షీణించి.. శుక్రవారం సెషన్‌లో రూ.641 వద్ద ముగిసింది.

నైక్‌లోనూ పొదుపు చర్యలు..

గ్లోబల్‌ స్పోర్ట్స్‌వేర్‌ దిగ్గజం నైక్‌ తన వందలాది మంది ఉద్యోగులకు ఎసరు పెడుతోంది. 2020లోనూ 700 మందిని ఇంటికి పంపించింది. తాజాగా సిబ్బందిని తొలగించడం, కొన్ని సేవలలో ఆటోమేషన్‌ను పెంచడం ద్వారా దాదాపు రూ.16వేల కోట్ల పైగా వ్యయాలను ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. సంస్థాగత క్రమబద్ధీకరణ అవసరానికి అనుగుణంగా ఈ తొలగింపులు చేపడుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. తొలగిస్తున్న ఉద్యోగులకు చెల్లించే సీవరెన్స్‌ ప్యాకేజీల కోసం దాదాపు రూ.3,700 కోట్లను కేటాయించనుంది.

➡️