Nara Lokesh: వందరోజుల్లో గంజాయిని అరికట్టాలి

  • పోలీసులకు లోకేష్‌ ఆదేశాలు జారీ

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) : రాష్ట్రంలో వందరోజుల్లో గంజాయిని అరికట్టాలని రాష్ట్ర మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్‌ పోలీసులకు ఆదేశించారు. బక్రీద్‌ పండుగ సందర్భంగా గుంటూరు జిల్లా ఈద్గాలో ముస్లిముల ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ హోం మంత్రి అనిత, టిడిపి పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి పోలీసు ఉన్నత అధికారులకు గంజాయిపై వివరించామని తెలిపారు. తనను గెలిపించిన మంగళగిరి ప్రజలకు సేవ చేసేందుకు కషి చేస్తున్నామన్నారు. హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం చేసేందుకు ప్రణాళిక రూపొందించుకుంటానని తెలిపారు. రాష్ట్రంలో వైసిపి నేతలే టిడిపి నేతలపై దాడులకు పాల్పడుతున్నారని, హత్యలు చేస్తున్నారని అరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓర్పుగా ఉండమన్నారనే విషయం గుర్తుంచుకుని తాము దాడులకు దిగలేదన్నారు. అయినా, తమపై వైసిపి నాయకులు ఎలా ఆరోపణలు చేస్తారంటూ ప్రశ్నించారు. శాంతిభద్రతలకు భంగం కలగకూడదనే శాంతియుతంగా ఉన్నామన్నారు. గెలిచి కేవలం పది రోజులు మాత్రమే అయిందని, పదేళ్ల పాటు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లు ఏం చేశారో చెప్పాలన్నారు. వైజాగ్‌ రుషికొండ వ్యవహారంపై ముఖ్యమంత్రి నివేదిక సమర్పించాలని అధికారులను కోరామన్నారు. రుషికొండ లాంటివి రాష్ట్రంలో చాలానే జరిగాయని, అన్నిటి మీద నివేదిక వచ్చిన అనంతరం ప్రజల ముందు బహిర్గతం చేస్తామని చెప్పారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ చిల్లపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

➡️