జిడిపిలో తగ్గిన వ్యవసాయం వాటా

Dec 20,2023 21:05 #Business

30 ఏళ్లలో 35% నుంచి 15 శాతానికి పతనం

పెరిగిన సేవలు, పారిశ్రామిక రంగాలు

మంత్రి అర్జున్‌ ముంద్రా వెల్లడి

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాగా ఉన్న వ్యవసాయ రంగం పరపతి క్రమంగా తగ్గిపోతోంది. కోవిడ్‌ సమయంలోనూ అన్ని రంగాలు విఫలం కాగా.. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు జిడిపికి మద్దతుగా నిలిచాయి. అయినా ప్రభుత్వాలు వ్యవసాయంపై చేస్తున్న నిర్లక్ష్యంతో ఆ రంగం జిడిపిలో క్రమంగా కీలక వాటాను కోల్పోతోంది. ఇందుకు కేంద్ర మంత్రి లోకసభకు ఇచ్చిన వివరణనే నిదర్శనం. ”జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 1990-91లో 35 శాతంగా ఉంది. 2022-23లో 15 శాతానికి తగ్గింది. పారిశ్రామిక, సర్వీస్‌ సెక్టార్‌ వేగంగా వృద్థి చెందడంతోనే వ్యవసాయ రంగం వాటా తగ్గింది. ” అని లోక్‌సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్‌ ముంద్రా అన్నారు. ఉత్పత్తి పడిపోవడం వల్ల వ్యవసాయ రంగం వాటా తగ్గిపోలేదని.. పరిశ్రమలు, సర్వీస్‌ సెక్టార్‌లో ఉత్పత్తులు వేగంగా పెరగడమే కారణమన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు గత ఐదేళ్లలో ఏడాదికి 4 శాతం చొప్పున వృద్థి సాధించాయన్నారు.వ్యవసాయానికి సంబంధించి కేవలం మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. గ్లోబల్‌ జిడిపిలో వ్యవసాయ రంగం వాటా 4 శాతంగా ఉందన్నారు. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెంచడానికి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు, వనరులను సమర్థంగా వినియోగించేందకు ప్రభుత్వం వివిధ పథకాలు, సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు. 2019 నుంచి పిఎం కిసాన్‌ కింద ఏడాదికి మూడు విడతల్లో ఎకరాకు మొత్తంగా రూ.6వేలు ఇస్తుందన్నారు. 11 కోట్ల మంది రైతులకు ఇప్పటి వరకు రూ.2.81 లక్షల కోట్లు అందించామన్నారు.

➡️