అదరగొట్టిన ఎస్‌బిఐ

May 10,2024 08:41 #Business

మార్చి త్రైమాసికంలో రూ.20,698 కోట్ల లాభాలు
తగ్గిన మొండి బాకీలు
న్యూఢిల్లీ : దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఎస్‌బిఐ, పిఎన్‌బిలు బంఫర్‌ ఫలితాలను ప్రకటించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) 24 శాతం వృద్థితో రూ.20,698.35 కోట్ల నికర లాభాలు సాధించింది. అధిక నికర వడ్డీ ఆదాయం, మొండి బాకీలు తగ్గడంతో మెరుగైన ఫలితాలు నమోదు చేసింది. 2022-23 ఇదే క్యూ4లో రూ.16,694.5 కోట్ల లాభాలు ఆర్జించింది. 2023 డిసెంబర్‌ త్రైమాసికంలోని రూ.9,163.93కోట్ల లాభాలతో పోల్చితే గడిచిన క్యూ4లో 125 శాతం వృద్థిని కనబర్చింది. 2023ా24 మొత్తం ఆర్థిక సంవత్సరంలో ఎస్‌బిఐ నికర లాభాలు 21.59 శాతం పెరిగి రూ.61,077 కోట్లుగా నమోదయ్యాయి. గడిచిన క్యూ4లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 3 శాతం పెరిగి రూ.41,656 కోట్లుగా ప్రకటించింది.
డివిడెండ్‌..
2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ప్రతీ ఈక్వీటీ షేర్‌పై రూ.13.70 డివిడెండ్‌ను అందించడానికి ఎస్‌బిఐ బోర్డు ఆమోదం తెలిపింది. మే 22 వరకు స్టాక్స్‌ కలిగి న వాటాదారులకు జూన్‌ 5న చెల్లింపులు చేయనుంది. గడిచిన మార్చి త్రైమాసికంలో మొండి బాకీల కోసం రూ.1,609.78 కోట్ల కేటాయింపులు చేసింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.3,315.7 కోట్ల కేటాయింపులు జరిపింది. క్రితం క్యూ4 ముగింపు నాటికి బ్యాంక్‌ స్థూల నిరర్థక ఆస్తులు (జిఎన్‌పిఎ)లు రూ.2.24 శాతానికి తగ్గాయి. గతేడాది మార్చి ముగింపు నాటికి 2.78శాతంగా జిఎన్‌పిఎ నమోదయ్యింది. నికర నిరర్థక ఆస్తులు 0.67 శాతం నుంచి 0.57 శాతానికి పరిమితమయ్యాయి.
పెరిగిన రుణ, డిపాజిట్లు..
ఏడాదికేడాదితో పోల్చితే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణాల జారీ 15.24 శాతం పెరిగి రూ.37.67 లక్షల కోట్లకు చేరాయి. దేశీయ అడ్వాన్స్‌ల్లో 16.26 శాతం వృద్థి చోటు చేసుకుంది. రిటైల్‌ పర్సనల్‌ అడ్వాన్స్‌లు, కార్పొరేట్‌ రుణాల్లో వరుసగా 14.68 శాతం, 16.17 శాతం పెరుగుదల నమోదయ్యింది. మొత్తం డిపాజిట్లు 11.13 శాతం వృద్థితో రూ.49.16 లక్షల కోట్లకు చేరాయి. గురువారం బిఎస్‌ఇలో ఎస్‌బిఐ షేర్‌ 1.14 శాతం పెరిగి రూ.819.65 వద్ద ముగిసింది.

➡️