వ్యక్తిగత రుణాలపై పెద్ద ప్రభావముండదు

Nov 17,2023 19:25 #Loans, #RBI, #SBI, #Stock Markets
rbi

ఆర్‌బిఐ కొత్త నిబంధనలపై ఎస్‌బిఐ ఛైర్మన్‌
న్యూఢిల్లీ : వ్యక్తిగత రుణాల జారీలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించిన నూతన నిబంధనలు తమ బ్యాంక్‌పై స్పల్ప ప్రభావం మాత్రమే చూపనున్నాయని ఎస్‌బిఐ ఛైర్మన్‌ దినేష్‌ ఖారా పేర్కొన్నారు. పైగా తమ బ్యాంక్‌ మూలధన నిష్పత్తి పెరగనుందన్నారు. ఎస్‌బిఐ వద్ద తగినన్ని రిజర్వులు ఉన్నాయని.. కొత్త నిధుల సమీకరణ కూడా అవసరం లేదన్నారు. బ్యాంక్‌లు, ఎన్‌బిఎఫ్‌సిలు జారీ చేసే వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డ్‌ రుణాల నిబంధనలను కఠినతరం చేస్తూ ఆర్‌బిఐ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. హామీలేని వ్యక్తిగత రుణాలకు రిస్క్‌ వెయిట్‌ను 25 బేసిస్‌ పాయింట్ల మేర పెంచింది. ఈ సవరించిన నిబంధనలు గృహ, విద్య, వాహన, బంగారం తనఖా రుణాలకు వర్తించవు. ఈ రుణాలకు యథాతథంగా 100 శాతం రిస్క్‌ వెయిట్‌ కొనసాగుతుందని తెలిపింది. కాగా.. హామీలేని వ్యక్తిగత రుణాలపై రిస్క్‌ వెయిట్‌ను 25 పర్సెంటేజీ పాయింట్లు పెంచి 125 శాతానికి చేర్చింది. అదే సమయంలో క్రెడిట్‌ కార్డు రుణాల విషయంలో రిస్క్‌ వెయిట్‌ను 25 పర్సెంటేజీ పాయింట్లు పెంచి ప్రస్తుత 125 శాతం నుంచి 150 శాతానికి చేర్చింది. అధిక రిస్క్‌ వెయిట్‌ ఉంటే.. బ్యాంకులు ఆయా హామీలేని వ్యక్తిగత రుణాల కోసం మరిన్ని నిధులను పక్కన పెట్టాల్సి వస్తుంది. ఆర్‌బిఐ నిర్ణయంతో శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌లో బ్యాంక్‌లు, ఎన్‌బిఎఫ్‌సిల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

➡️