అంగనవాడీల సమస్యలను పరిష్కరించాలని నిరవధిక సమ్మె

ప్రజాశక్తి-మంగళగిరి(గుంటూరు) : అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మంగళగిరి అంబేద్కర్‌ సెంటర్లో అంగన్వాడీల నిరవధిక సమ్మె శిబిరాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐటియు సీనియర్‌ నాయకులు జె వ రాఘవులు, యూనియన్‌ గౌరవాధ్యక్షులు వేముల దుర్గారావు మాట్లాడుతూ అంగన్వాడీలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటి అమలు చేయడం లేదని అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేయకపోగా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పని భారం నుంచి అంగన్వాడీలకు మనోవేదనకు గురి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం కన్నా అదనంగా వేతనం ఇస్తానని చెప్పి విస్మరించారని అన్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళన తీవ్రతరం చేస్తామని, సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. తొలుత మంగళగిరి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలు మరి బాలకష్ణ మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలియజేశారు. అదేవిధంగా ఏఐటీయూసీ నాయకులు ఏ ప్రభాకర్‌, నందం బ్రహ్మేశ్వర, జి దుర్గారావు సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎం పకీరియా, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎం బాలాజీ, యూనియన్‌ నాయకులు హేమలత, జయశ్రీ, రుక్మిణి, తిరుపతమ్మ, సుహాసిని, మేరీ, భూలక్ష్మి, వినీల తదితరులు పాల్గొన్నారు.

➡️