అంగన్వాడీల ఆకలి కేకలు జగనన్నకు పట్టావా?

Dec 29,2023 20:26

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ 18 రోజులుగా సమ్మె చేస్తున్న అంగనవాడీ అక్కచెల్లెళ్ల ఆకలి కేకలు జగనన్నకు పట్టవా అని స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ నాయకులు అన్నారు. అంగనవాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ సమీపంలో నిర్వహిస్తున్న నిరసన శిబిరంలో నిరాహారదీక్షలు చేపట్టారు. ‘నీ పొట్ట నిండితే సరిపోద్దా..’ మా పొట్టలు నింపవా జగనన్నా’ అంటూ నినాదాలు చేశారు. ప్రాజెక్టు నాయకులు మర్రాపు అలివేలు, సాలూరు గౌరీమణి, సిఐటియు నాయకులు బి.లక్ష్మి ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమంలో కె.రాజేశ్వరి, ఎం.గౌరీ, బి.శాంతి, ధర్మవతి అధిక సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

గుమ్మలక్ష్మీపురం : అంగన్‌వాడీలు తమ సమస్యలపై సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కురుపాం నియోజకవర్గం టిడిపి ఇన్‌ఛార్జి తోయక జగదీశ్వరి అన్నారు. గుమ్మలక్ష్మీపురంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెలో పాల్గొని ఆమె సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు, ట్రైబల్‌ రైట్‌ ఫోరం అధ్యక్షులు రొబ్బ లోవరాజు, అంగన్వాడీ యూనియన్‌ అధ్యక్ష,కార్యదర్శులు సత్యవతి, కస్తూరి, పలువురు కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.

సాలూరు: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు చేపట్టిన సమ్మె 18రోజుకు చేరింది. యూనియన్‌ ప్రాజెక్టు నాయకులు బి.రాధ, ఎ.నారాయణమ్మ, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు ఆధ్వర్యాన స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో రిలేదీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు ఆమోదించే విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని అన్నారు. హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇచ్చిన హామీ లను అమలు చేయాలని కోరుతూ సమ్మె చేస్తుంటే తప్పేముందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తే రానున్న ఎన్నికల్లో మూల్యం చెల్లించాల్సి వుంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శ్యామల, వరలక్ష్మి, తిరుపతమ్మ, పార్వతి, శశికళ పాల్గొన్నారు.

గరుగుబిల్లి : అంగన్వాడీల సమ్మె శిబిరం వద్ద నీటిలో తెప్పలు వదిలి దీపాలు వెలిగించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్‌ మండల నాయకులు గౌరమ్మ , సావిత్రి, పద్మావతి కాత్యాయని, హైమావతి తదితరులు పాల్గొన్నారు. సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణంలో శుక్రవారం నాటికి 18 వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలంతా సిఎం జగన్మోహన్‌రెడ్డికి పోస్ట్‌ కార్డు ఉద్యమం ద్వారా తమ సమస్యలు తెలుపుతూ పరిష్కరించాలని పోస్ట్‌ కార్డు ఉద్యమం చేపట్టారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.రామలక్ష్మి, సిఐటియు కార్యదర్శి జి.వెంకటరమణ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రెడ్డి ఈశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు వై.సత్యవతి, జి.సునీత, ఆర్‌.లక్ష్మి, పద్మతో పాటు వివిధ గ్రామాలకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పాలకొండ : స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీల రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం అసత్యాలు ప్రచారంపై తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ అబద్ధ ప్రచారాలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. వీరి ఆందోళనకు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దూసి దుర్గారావు, అభ్యుదయ రైతు సంఘం సీనియర్‌ నాయకులు ఖండాపు ప్రసాదరావు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.హిమప్రభ, కోశాధికారి బి.అమరవేణి, పాలకొండ ప్రాజెక్ట్‌ అధ్యక్షులు జి.జెస్సీబారు, ప్రాజెక్ట్‌ కమిటీ ప్రతినిధులు ఎం.శ్యామల, ఎం.శ్రీదేవి, బి.లలిత, ఎస్‌.నిర్మల, బి.వసుంధర, టి.పుష్ప, ప్రాజెక్టు పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, వర్కర్లు పాల్గొన్నారు.

కొమరాడ : అంగన్వాడీల సమ్మె 18వ రోజు మండలంలో కొనసాగింది. సమ్మెలో భాగంగా నాగావళి నది వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం శివాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేస్తూ అంగన్వాడీలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్ల యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గంట జ్యోతి మాట్లాడుతూ 18 రోజులుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతామన్న హామీ ను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కొమరాడ ప్రాజెక్టు యూనియన్‌ ఉపాధ్యక్షులు సిరికి అనురాధ, నాయకులు బి.అలివేలు, జ్యోతి, పద్మ, మల్లేశ్వరమ్మ, ఎస్తేరాణి, సిఐటియు నాయకులు కె.సాంబమూర్తి, అరకు పార్లమెంట్‌ రైతు అధ్యక్షులు బత్తిలి శ్రీనివాసరావు, మండలంలోని అన్ని అంగన్వాడీ సెంటర్ల నుంచి భారీగా సిబ్బంది పాల్గొన్నారు.

కురుపాం : స్థానిక పెట్రోల్‌ బంకు సమీపాన చేపడుతున్న సమ్మెలో అంగన్వాడీలు మోకాళ్లపై కూర్చొని, మెడలో పూలదండలు వేసి జగనన్నకు దండం పెడుతూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళ కుమారి, ప్రాజెక్ట్‌ కార్యదర్శి జె.సరోజ అధిక సంఖ్యలో అంగన్వాడీలు కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఎదుట అంగన్‌వాడీలు తలపెట్టిన నిరవధిక సమ్మెకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై.మన్మధరావు, మధ్యాహ్న భోజన పథకం యూనియన్‌ కార్యదర్శి శాంతికుమారి సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పరిష్కరించాలని, లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి ఎం.కాంతారావు, అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి ఎ.దర్శమి, పలువురు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు

➡️