అంగన్వాడీల చారిత్రాత్మక విజయం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ వైసిపి ప్రభుత్వ నిర్భంధాన్ని ఎదిరించి హామీలను సాధించుకున్న అంగన్‌వాడీలకు అభినందనలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి. మనోహర్‌, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.నాగసుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం కడప పాత బస్టాండ్‌ లో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి పి.వెంకటసుబ్బయ్య అధ్యక్షతన విజయోత్సవ సభ నిర్వహించారు. అంగన్‌వాడీలకు మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు. అంగన్‌వాడీలకు సంఘీభావం తెలిపి రోడ్డు ప్రమాదంలో మరణించిన సాబ్జి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మనోహర్‌, నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ అంగన్‌వాడి ఉద్యోగులు 42 రోజులుగా మొక్కవోని పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధాన్ని, కుయుక్తులను సైతం ఎదుర్కొని సమ్మెను జయప్రదం చేశారని పేర్కొన్నారు. తమ కోర్కెలు సాధించుకున్నందుకు సమ్మెకు సంఘీభావం ప్రకటించిన సంఘాలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం జీతాలు పెంచడానికి అంగీకరించి అంగన్‌వాడీ సంఘాలతో ఒప్పందం చేయడం హర్షణీయమని చెప్పారు. అంగీకరించిన అంశాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎటువంటి క్షసాధింపులకు పాల్పడకుండా ఉద్యోగుల హక్కులను గౌరవించాలని తెలిపారు. అంగన్వాడీలకు లబ్దిదారులు, ప్రజలు ప్రభుత్వ చర్యలను నిరసించి అండగా నిలబడ్డారని తెలిపారు. ఎస్మాను లెక్కచేయలేదన్నారు. కలెక్టర్లు నోటీసులిచ్చినా అంగన్‌వాడీలు బెదరలేదని పేర్కొన్నారు. ఉద్యోగాలు పీకేస్తామని, కొత్త రిక్రూట్‌మెంట్‌ చేసుకుంటామని నోటీసులిచ్చి, భయపెట్టి, బెదిరించినా లెక్కచేయలేదని చెప్పారు. విజయవాడ ధర్నాచౌక్‌ శిబిరంలో మహిళలని కూడా చూడకుండా అర్థరాత్రి చీకటిలో, మగపోలీసులతో నానా భీభత్సం సృష్టించి అరెస్టులు చేశారని తెలిపారు. 200 కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళి నడిరోడ్డుపై వదిలివేశారన్నారు. చివరకు యూనియన్‌ అరెస్టు చేయాలని రకరకాల కుయుక్తులు పన్నారు. ఇన్నిరకాల నిర్బంధాలను, రాష్ట్ర ప్రభుత్వ కుయుక్తులను సంఘం అండతో ఉమ్మడిగా ఉద్యోగులంతా ఒక్కటై ఎదిరించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్మికుల ఐక్యత, ఇతర సంఘాల, రంగాల కార్మికుల సంఘీభావం, ప్రజల మద్దతు అవసరమని అంగన్‌వాడీ సమ్మె తెలియజేస్తుందని చెప్పారు. నాయకులు చేతులు పైకెత్తి సంఘీభావం తెలిపారు. విజయోత్సవ సభలో సిపిఐ(యం), సిపిఐ జిల్లా కార్యదర్శిలు జి.చంద్ర శేఖర్‌, జి.చంద్ర, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌. లక్ష్మీదేవి, బి.లక్ష్మీదేవి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఐ.ఎన్‌.సుబ్బమ్మ, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తగిరి రెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి వెంకట శివ, బిఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్స్‌ యూనియన్‌ కార్యదర్శి కళ్యా సుధాకర్‌ ప్రసగించారు. సభలో ఎఐటియుసి నగర ప్రధాన కార్యదర్శి మద్దిలేటి, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి.ఎం. ఓబులేసు, బిఎస్‌ఎన్‌ఎల్‌ సీనియర్‌ నాయకులు సుధాకర్‌, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్‌,రవి,వై కేశవ, ఏపీ మెడికల్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు పి.పవన్‌ కుమార్‌, బి.దస్తగిరి, మహిళా సంఘం నాయకురాలు భాగ్యలక్ష్మి, డివైఎఫ్‌ఐ నాయకులు విజరు, ఉదరు, పెద్ద సంఖ్యలో అంగన్వాడీలు పాల్గొన్నారు.

➡️