అంగన్‌వాడీల నిరసన ప్రదర్శన

Dec 15,2023 22:26 #Anganwadi Workers
ఫొటో : నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలు

ఫొటో : నిరసన వ్యక్తం చేస్తున్న అంగన్‌వాడీలు
అంగన్‌వాడీల నిరసన ప్రదర్శన
ప్రజాశక్తి-అనంతసాగరం : రాష్ట్ర ప్రభుత్వం సచివాలయం ఉద్యోగులతో తాళాలు పగలగొట్టి అంగన్‌వాడీ సెంటర్‌లను తెరవడానికి ప్రయత్నం చేస్తుందని నిరసనగా శుక్రవారం అంగన్‌వాడీలు నల్ల చీరలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి అన్వర్‌ బాషా మాట్లాడుతూ పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అంగన్‌వాడీలకిచ్చిన హామీలను నెరవేర్చమని అడుగుతున్నామే తప్ప ఎలాంటి గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. పలుమార్లు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకునే పరిస్థితిలో లేకపోవడంతో అంగన్‌వాడీలు సమ్మె చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా అంగన్‌వాడీ సెంటర్ల తాళాలను బద్దలు కొట్టి సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో తెరిపించడం దుర్మార్గమన్నారు. అంగన్‌వాడీలకు సక్రమంగా నిత్యావసర వస్తువులు సరఫరా చేయలేని ప్రభుత్వాలు అంగన్‌వాడీ పిల్లలను తీసుకుని వెళ్లి మిడ్‌ డే మీల్స్‌ ద్వారా భోజనం పెట్టించడం దుర్మార్గమన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీలతో చర్చలు జరిపి సానుకూలమైన నిర్ణయం తీసుకొని సమ్మెను ముగింపు చేయాలని కోరుతున్నామన్నారు. అనంతరం ఎంపిడిఒ మధుసూదన్‌ రావుకు వినతి పత్రం అందజేశారు. పిడిఎఫ్‌ ఎంఎల్‌సిగా ఉండి, కార్మికుల పక్షాన ఉద్యోగుల పక్షాన, పేద ప్రజల పక్షాన శాసనమండలిలో తన గొంతును వినిపిస్తున్న ఉపాధ్యాయ ఎంఎల్‌సి షేక్‌.సాబ్జీ అంగన్‌వాడీల సమ్మెకు మద్దతు తెలియజేయడానికి ఏలూరు నుండి భీమవరంకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించారని తెలిపారు. ఆయన మృతికి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ఆధ్వర్యంలో మౌనం పాటించి నివాళులర్పించారు. వ్యకాసం జిల్లా కార్యదర్శి పుల్లయ్య, జెవివి రాష్ట్ర కమిటీ సభ్యులు వేము పెంచలయ్య, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు సునీత, లక్ష్మి, సుబ్బమ్మ, నూర్జహాన్‌, భాగ్యమ్మ, మర్రిపాడు, అనంతసాగరం మండలాలకు సంబంధించిన అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మెలో పాల్గొన్నారు.

➡️