అంగన్‌వాడీల పోరాటం ఉధృతం

గుంటూరు శిబిరంలో వంట చేస్తున్న అంగన్‌వాడీలు
ప్రజాశక్తి-గుంటూరు, పల్నాడు జిల్లా : వేతనాలు పెంపు, ఎన్నికల్లో ప్రభుత్వ హామీలు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లతో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది. మంగళవారం గుంటూరు కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరంలోవంటా వార్పు చేపట్టారు. సమ్మె శిబిరంలోనే వంట చేసి, హాజరైన అంగన్‌వాడీలు అక్కడే భోజనం చేశారు. గుంటూరు నగరంలోని అంగన్‌వాడీలు పెద్ద సంఖ్యలో సెమ్మె శిబిరానికి వచ్చి నిరసన తెలియజేశారు. పలువురు అంగన్‌వాడీలు చంటి బిడ్డలతో సమ్మెలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో భిక్షాటన నిర్వహించారు. బుధవారం వంటావార్పు చేపడగామని యూనియన్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్డాదేవి ప్రకటించారు. గుంటూరు కార్యక్రమంలో ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి పి.దీప్తి మనోజ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్‌వాడీ సెంటర్లకు తాళాలు పగులగొట్టినా, ఎంత నిర్భంధం ప్రయోగించినా సమస్యలు పరిష్కారమయ్యే వరకూ సమ్మె కొనసాగిస్తామని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. యూనియన్‌ నగర నగర కార్యదర్శి టి.రాధ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.శ్రీనివాసరావు, పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్షులు యు.గనిరాజు, ఐఎఫ్‌టియు న్యూ జిల్లా నాయకులు కె.కోటయ్య, మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి షేక్‌.సలీం తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. లేదంటే అన్ని సంఘాలు ప్రత్యక్ష కార్యచరణకు దిగుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటియు నగర తూర్పు, పశ్చిమ ప్రధాన కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు, ప్రాజెక్ట్‌ అధ్యక్షురాలు చినవెంకాయమ్మ నాయకులు శ్యామలా, వేదవతి, గోళ్ల మెర్సి, బాజీబి, పద్మ పాల్గొన్నారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి కార్యాలయాల నిరసన కార్యక్రమాలు చేస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి హెచ్చరించారు.

జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో ధర్నా చౌక్‌ వద్ద అంగన్వాడీలు చేపట్టిన నిర్మాధిక సమ్మె మంగళవారం 8వ రోజుకు చేరుకుంది. మల్లీశ్వరి మాట్లాడుతూ అధికారులు అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టి సెంటర్లు తెరిచినా చిన్నారులను పంపించేందుకు తల్లిదండ్రులు సుముఖుత వ్యక్తం చేయడం లేదన్నారు. అంగన్వాడీ సిబ్బంది లేనిదే తమ పిల్లలను పంపమంటూ తల్లిదండ్రులు అధికారులకు తెగేసి చెబుతున్నారని, గర్భిణీలు బాలింతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెకు మద్దతు పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అంగన్వాడీలపై బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ ధోరణి మానుకొని సమస్యలు పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు. ఎంఆర్‌పిఎస్‌ నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు సిహెచ్‌ మీరయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి చేసే పోరాటాలకు స్ఫూర్తినిచ్చేలా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె సాగుతోందన్నారు. ప్రభుత్వ నిర్బంధాలకు బెదిరింపులకు లెక్కచేయకుండా సమ్మె కొనసాగించడం అభినందనీయమని, పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. అనంతరం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో అంగన్వాడీలు బృందాలుగా ఏర్పడి భిక్షాటన చేపట్టారు. సిఐటియు నాయకులు షేక్‌. సిలార్‌ మసూద్‌, ఆంజనేయ నాయక్‌, నిర్మల కవిత, ఎఐటియుసి నాయకులు హెల్డా ఫ్లారిన్స్‌, శోభారాణి, కె.రాంబాబు, రంగయ్య పాల్గొన్నారు.

➡️