అంగన్వాడీల పోరాటం దేశానికే ఆదర్శం

Jan 8,2024 21:12

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : సంఖ్యాబలం ఉందనే మదంతో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ, ప్రజల సమస్యలను పక్కన పెడుతూ నియంతల్లా ప్రవర్తిస్తున్న కేంద్ర, రాష్ట్ర పాలకులకు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న సమ్మె కనువిప్పు కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది అంగన్వాడీలు 28 రోజులుగా చేస్తున్న సమ్మెను అణచివేయడానికి ఎస్మా చట్టాన్ని వారిపై ప్రయోగించిన ప్రభుత్వ దమననీతికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు వారికి అండగా నిలబడి పోరాటానికి సంపూర్ణ మద్దతు పలికాలి. ఈ మేరకు స్థానిక కలెక్టరేట్‌ వద్ద ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు పి.సరళకుమారి, సిఐటియు నాయకులు బి.లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక నిరాహార దీక్ష శిబిరానికి తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ (ఎమ్‌ ఎల్‌ ) సిపిఐ (ఎం ఎల్‌ ) న్యూ డమోక్రసి, సిపిఐ (ఎమ్‌ ఎల్‌ ) లిబరేషన్‌ రైతుకూలి సంఘం, ఎఐసిసిటియు, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు హాజరై తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. తొలుత టిడిపి అధికార ప్రతినిధి ద్వారపురెడ్డి జగదీష్‌ మాట్లాడుతూ ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక వర్గాలతో పాటు వేతన జీవులందర్నీ మోసగించారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరిన పాపానికి అంగన్‌వాడీలపై అణచివేత చర్యలు చేపట్టి ఒక నియంతలా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని అన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ దాదాపు నెల రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఎస్మా వంటి చట్టాలను మహిళలపై ప్రయోగించి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు అంగీకరించరని అన్నారు. మరి కొద్ది రోజుల్లో టిడిపి అధికారంలోకి రానుందని, వచ్చిన తర్వాత అంగన్వాడీల సమస్యలను సానుకూలంగా పరిశీలించి పరిష్కరిస్తామని ఇప్పటికే తమ అధినేతలు చంద్రబాబు, లోకేష్‌ తెలియచేశారని తెలిపారు. అనంతరం వామపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తుందని, న్యాయమైన కోర్కెలను పరిష్కరించమని అంగన్వాడీలతో పాటు ఇతర రంగాలు కూడా చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాజెక్టుల నుంచి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు నిరాహార దీక్షలో పాల్గొనగా, పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర, కౌన్సిలర్‌ తాతపూడి వెంకటరావు, వామపక్ష, ప్రజాసంఘాల నాయకులు మోణంగి భాస్కరరావు, పి,రమణి, బి.నరశింగరావు, సంగం, అజ్జరాపు దామోదర్‌, విశ్వేశ్వరరావు, పాకల సన్యాసిరావు సంఘీభావం తెలిపారు.కొమరాడ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సమ్మెలో భాగంగా స్థానిక జెడ్‌పి హైస్కూల్లో ఉన్న గాంధీ విగ్రహానికి అంగన్వాడీలు వినతిపత్రం అందజేసి తమ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతూ నిరసన తెలిపారు. అనంతరం జిఒ 2 ప్రతులను రద్దు చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ యూనియన్‌ కొమరాడ ప్రాజెక్టు ఉపాధ్యక్షులు సిరికి అనురాధ, సిఐటియు నాయకులు కె.సాంబమూర్తి, పలువురు అంగన్‌వాడీలు పాల్గొన్నారు.గుమ్మలక్ష్మీపురం : తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరితే ప్రభుత్వం మొండిగా వ్యవహరించి ఎస్మా ప్రయోగించడం పట్ల అంగన్వాడీలు రోజుకొక రీతిలో నిరసనలు తెలియజేస్తూ సమ్మె కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే గుమ్మలక్ష్మీపురంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలు సోమవారం మెడకు ఉరి తాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో అంగనవాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు అధ్యక్షులు సత్యవతి మండిపడ్డారు. కార్యక్రమంలో కార్యదర్శి కస్తూరి ఉన్నారు. సీతానగరం : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట సోమవారం నాటికి అంగన్వాడీల సమ్మె 28వ రోజుకు చేరుకున్నది. ఈ సందర్భంగా అంగన్వాడీలంతా ఒంటి కాలిపై నిల్చొని దండాలు పెడుతూ జగన్మోహన్‌రెడ్డి గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా సంఘం నాయకులు వి.రామలక్ష్మి, సిఐటియు నాయకులు జి.వెంకటరమణ, వై.రామారావు, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు ఎస్‌.శైలజ, ఎస్‌.సునీత, ఆర్‌.లక్ష్మి, డి.అరుణ, ఎం.సత్యవతి తదితరులు పాల్గొన్నారు.సీతంపేట : స్థానిక ఐటిడిఎ ఎదుట జరుగుతున్న అంగన్‌వాడీల నిరధిక సమ్మెను ఉద్దేశించి సిఐటియు సీనియర్‌ నాయకులు ఎ.భాస్కరరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన ప్రజాస్వామికమైన పోరాటంపై ఎస్మా లాంటి దుర్మార్గమైన అస్త్రాన్ని ప్రయోగిం చడం ఆటవిక చర్యన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్ట్‌ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎ.పార్వతి, ఎ.దర్శమి, సిఐటియు మందల అధ్యక్ష కార్యదర్శులు ఎస్‌.సురేష్‌, ఎం. కాంతారావు, పలువురు అంగన్వాడీలు పాల్గొన్నారు. పాచిపెంట : స్థానిక ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీల సమ్మె కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రాజెక్టు నాయకులు ఎం.బంగారమ్మ, పైడిరాజు, సాయి, పూజ, బేగం, సుగుణమ్మ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్‌ 2 కాపీలను దగ్ధం చేశారు. వీరికి మద్దతుగా సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు , అంగన్‌వాడీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.పాలకొండ : స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద అంగన్‌వాడీలు ఆందోళన వ్యక్తం చేశారు. చట్ట వ్యతిరేకంగా అంగన్వాడీలకు వర్తించని, ఎస్మా చట్టం జిఒ2 ను తక్షణ ఉపసహరించుకోవాలని, 28వ రోజు సమ్మె చేస్తున్నా సమస్య పరిష్కరించకుండా నిర్బంధం ద్వారా ఉద్యమాన్ని ఆపలేరని హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే తెలంగాణలో కెసిఆర్‌ ప్రభుత్వానికి పట్టిన గతే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి పడుతుందని అంగన్వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ యూనియన్‌ హెచ్చరించింది. కార్యక్రమంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.హిమాప్రభ, జె.జెస్సీబారు, జి.శారద, లలిత, దివ్య, నిర్మల, భవాని, శ్రీదేవి నాయకత్వం వహించారు.బలిజిపేట : స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల వద్ద అంగన్వాడీలో చేపడుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా సోమవారం పోర్లు దండాలు పెడుతూ సోమవారం నిరసన తెలిపారు. మహిళా పక్షపాత ప్రభుత్వమని చెప్పి నేడు మహిళలపై ఇటువంటి అరాచక పాలన కొనసాగించడం సరైన పద్ధతి కాదని తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీలో తదితరులు పాల్గొన్నారుసాలూరు: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చేపట్టిన సమ్మె 28రోజుకి చేరింది. సోమవారం గడ్డి తింటూ అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యాన కార్యకర్తలు, హెల్పర్లు నిరసన శిబిరం వద్ద ఆందోళన చేపట్టారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి జ్యోతి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ వి.ఇందిర శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని చెప్పారు. ఎస్మా చట్టం ప్రయోగిస్తూ బెదిరింపులకు దిగుతోందని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు ఎ.నారాయణమ్మ, తిరుపతమ్మ, పార్వతి, శశికళ, సుజాత పాల్గొన్నారు.మా బాధలు పట్టవా..? : ఎమ్మెల్యేను నిలదీసిన అంగన్‌వాడీలుగరుగుబిల్లి : తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోరుతూ 28రోజులుగా ఆందోళన చేపడుతున్నా ప్రభుత్వానికి పట్టడంలేదానని కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని అంగన్‌వాడీలు నిలదీశారు. సోమవారం వైయస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ కార్యక్రమంలో భాగంగా మండలానికి వచ్చిన ఎమ్మెల్యే కారును నిలిపి వేసి తమ న్యాయమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి నోరు మెదపకపోవడం, ఎమ్మెల్యేలైనా మా న్యాయమైన సమస్యలను సిఎంకు చేరేలా చర్యలు చేపట్టాలని అంగన్‌వాడీలు వినతి అందజేశారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే జీతాలు కన్నా వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తామని మాట ఇచ్చిన జగనన్న మరిచినట్లు మమ్మల్ని నడివీధిలో పెట్టినవ్వుల పాలు చేస్తున్నట్టు అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. మాట తప్పని మడం తిప్పని నాయకుడని నమ్మి గెలిపించినందుకు సరైన బుద్ధి చెప్పారని అన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షులు గౌరమ్మ, పెదగుడబ సెక్టార్‌ నాయకులు సావిత్రి, రావుపల్లి లక్ష్మి, సత్యవతి, పద్మ, అరుణ, ఎం.హైమావతి తదితరులు పాల్గొన్నారు.

➡️