అంగన్వాడీల బిక్షాటన

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : డిమాండ్ల సాధన కోసం జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు చేపడుతున్న సమ్మె 9వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా బుధవారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపి అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వెళ్లి బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు బి.పైడిరాజు, సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.రమణమ్మ మాట్లాడారు. ఒక్క అవకాశం అన్నందుకు జగన్మోహన్‌ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకున్న పాపానికి మహిళలు రోడ్లెక్కి బిక్షం ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని అన్నారు. ఇన్నిరోజులుగా అంగన్వాడీలు ఇళ్లు, కుటుంబాలను వదిలి రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నామన్నారు. 9 రోజులైనా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవడం బాధాకర మన్నారు. ప్రభుత్వం ఎంత ఆలస్యం చేస్తే అంత పెద్ద ఎత్తున ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల పోరాటానికి ఎపి మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ నాయకులు యుఎస్‌ రవికుమార్‌, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శశిధర్‌,సూర్య భగవాన్‌ లు మద్దతు తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట సాయంత్రం నాలుగు గంటల వరకు నిరసన కొనసాగించారు. కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు బి.రమణ, అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పాల్గొన్నారు.కొత్తవలస : కొత్తవలసలో అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కాకర తులసి ఆధ్వర్యాన వంటావార్పు చేపట్టారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు రెడ్డి శంకరావతి, తదితరులు పాల్గొన్నారు.రామభద్రపురం : స్థానిక బస్టాండ్‌ సమీపంలో అంగన్వాడీలు దీక్షలు కొనసాగించారు. దీక్షా స్థలానికి సమీపంలో వంటా వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బలసా శ్రీనివాసరావు, నాయకులు సత్యవతి, రాధమ్మ, మేరి, గౌరి పాల్గొన్నారు.బొబ్బిలి : అంగన్వాడీల పోరాటానికి అండగా ఉంటామని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బేబినాయన అన్నారు. అంగన్వాడీల సమ్మె శిబిరాన్ని బేబినాయన, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడ భాస్కరరావు, పట్టణ, మండల అధ్యక్షులు రాంబార్కి శరత్‌, వి.సత్యనారాయణ, మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గెంబలి శ్రీనివాసరావు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. సమ్మెలో భాగంగా అంగన్వాడీలు బిక్షాటన చేసి నిరసన తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు చీర కొంగులను జోలిగా పట్టి బిక్షాటన చేశారు. అంగన్వాడీలకు బేబినాయన, గెంబలి శ్రీనివాసరావు, ఇతర నాయకులు డబ్బులు వేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు కామేశ్వరి, అనురాధ, నిర్మల, పప్పల పద్మ, ఉమాగౌరి పాల్గొన్నారు.శృంగవరపుకోట : పట్టణంలోని తొమ్మిదో రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీలు ఐసిడిఎస్‌ కార్యాలయం నుంచి దేవి కూడలి వరకు బిక్షాటన చేపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు గడి బంగారునాయుడు, నాయకులు నానాజీ, బూడి అప్పారావు, సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, ప్రాజెక్టు లీడర్‌ డి.శ్యామల, డి.జయలక్ష్మి, ఎఐటియుసి నాయకులు వి.మాణిక్యం, బి.సుశీల పాల్గొన్నారు.గజపతినగరం : గజపతినగరంలో అంగన్వాడీలు వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. నల్లచీరలతో నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షులు ఎం.సుభాషిని, కార్యదర్శి పి.జ్యోతి, నాయకులు సన్యాసమ్మ, నాగమణి, రవణమ్మ, సుజాత, రాములమ్మ పాల్గొన్నారు.తెర్లాం : అంగన్వాడి యూనియన్‌ ఆధ్వర్యంలో ఎంపిడిఒ, తహశీల్దార్‌, ఎంఇఒ, వైకెపి కార్యాలయాల్లో అధికారులను కలిసి వినతులు అందజేశారు. ఉద్యమానికి తమ వంతు సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎ.రమేష్‌, మండల కార్యదర్శి గోపాల్‌, యూనియన్‌ నాయకులు జి.లక్ష్మి, సిహెచ్‌ రమణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

➡️