అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Jan 2,2024 22:11
ఫొటో : మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి ఎస్‌.కె.రెహనా బేగం

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి ఎస్‌.కె.రెహనా బేగం
అంగన్‌వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
ప్రజాశక్తి-సీతారామపురం : రాష్ట్రంలోని లక్షలాదిమంది అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌.కె.రెహనా బేగం, జిల్లా అధ్యక్షురాలు సుజాతమ్మ, మండల సిఐటియు నాయకులు కోడె రమణయ్య డిమాండ్‌ చేశారు. స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్‌వాడీ కార్యకర్తలు చేస్తున్న దీక్ష 22వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని లక్షలాదిమంది అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్లపైకొచ్చి దీక్షలు చేయడానికి కారణం ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీ కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తానని హామీనిచ్చి ఇప్పటికీ అమలు చేయక పోవడం వల్ల అంగన్‌వాడీ కార్యకర్తలు రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీ కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రతను కల్పించి, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రూ.26వేలు జీతం చెల్లించి టిఎ డిఎలను, రిటైర్మెంట్‌ బెనెఫిట్లను రూ.5లక్షలకు కొనసాగిస్తామని, ఆయాలను అర్హతను బట్టి అంగన్‌వాడీ టీచర్లుగా గుర్తించేలా శాసనసభలో ఎంఎల్‌ఎల ద్వారా పార్లమెంటులో ఎంపిల ద్వారా ప్రత్యేక చట్టం తీసుకొచ్చేలా చేస్తానని హామీనిచ్చారని వారు గుర్తు చేశారు. హామీలు ఇచ్చి నాలుగున్నర సంవత్సరం గడిచిన ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వైసిపి ప్రభుత్వ వైఫల్యం అని దుయ్యబట్టారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఏర్పాటుచేసిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు జీతాలు పెంచాలని సచివాలయాలకు తాళాలు వేసి దీక్షలు చేస్తే వెంటనే వారికి జీతాలు పెంచి ఉద్యోగ భద్రతను కల్పించారని కానీ 40యేళ్లుగా ప్రభుత్వానికి సేవలు చేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు శాంతియుతంగా వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం దీక్షలు చేస్తుంటే ప్రభుత్వ అధికారులు వారి సిబ్బందితో అంగన్‌వాడీ భవనాల తాళాలు పగులుగొట్టి రికార్డులు మార్చడం, సెంటర్లను నడిపించడం ఇతర ఆహార ధాన్యాలను వాడుకోవడం వాటిని వారి ఆధీనంలోకి తీసుకోవడం వల్ల అంగన్‌వాడీ కార్యకర్తలు, భవనాలకు భద్రత లేదన్నారు. శాంతియుతంగా దీక్షలు చేస్తున్న అంగన్‌వాడీ కర్యకర్తలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని వారు కోరారు. రాష్ట్రంలో ఏ ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఆయాకు అన్యాయం జరిగినా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. కాబట్టి శాంతియుతంగా జరుగుతున్న అంగన్‌వాడీల సమ్మెకు నాయకులతో చర్చలు జరిపి న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, శిశు సంక్షేమ శాఖ అధికారులు మంత్రులు అంగన్‌వాడీ కార్యకర్తలు నాయకులతో చర్చలు జరిపి సఫలీకృతమయ్యేలా చర్యలు తీసుకొని అంగన్‌వాడీ కార్యకర్తలకు అండగా ఉండాలని వారు కోరారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆదిలక్ష్మి, మమత, ఝాన్సీ రాణి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️