అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వ పతనం తప్పదు

ప్రజాశక్తి-మదనపల్లి అంగన్‌వాడీల సమస్యలు వింటారో లేదో సిఎం తేల్చుకోవాలని, వారి పోరాటం న్యాయ సమ్మతమైందని, ఇప్పటికైనా పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని ఉంచాలో లేదో అంగన్‌వాడీలే తేలుస్తారని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు హెచ్చరించారు. జగనన్నకు చెబుదామని విజయవాడ బయలుదేరిన అంగన్‌వాడీల అక్రమ అరెస్టుకు నిరసనగా సోమవారం స్థానిక బెంగళూరు బస్టాండ్‌లో అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పి.శ్రీనివాసులు మాట్లాడుతూ మహిళా శక్తికి మించింది మరొకటి లేదని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా వారిని నిరాహార దీక్ష చేసే వరకూ తీసుకెళ్లిన సిఎం అంగన్‌వాడీల సమస్యలు విని పరిష్కరిస్తారో లేదో తేల్చుకోవాలన్నారు. వారితో పెట్టుకున్న ప్రభుత్వాలేవీ ఇంతవరకు నిలబడిన దాఖలాలు లేవని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో డిసిపి విశాల్‌ గున్ని నాయకత్వంలో వందలాది మంది పోలీసులు విజయవాడ ధర్నా చౌక్‌లో టెంట్‌ను పీకేసి, కరెంట్‌ తీసేసి దీక్షలో ఉన్న వారి పట్ల కనికరం కూడా చూపకుండా, మహిళలని కూడా చూడకుండా అమానుషంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మగ పోలీసులే మహిళల పట్ల దురుసుగా వ్యవహరించడం చట్ట విరుద్ధమని ఆగ్రహించారు. సిపిఐ నాయకులు కృష్ణప్ప మాట్లాడుతూ సమస్యను పరిష్కరించడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. సిఐటియు జిల్లా కోశాధికారి టి.హరిశర్మ మాట్లాడుతూ మహిళలంటే చులకనగా చూస్తున్న ప్రభుత్వాలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న అంగన్వాడీ నాయకులతో పాటు వేలాది అంగన్వాడీ ఉద్యోగులను అర్ధరాత్రి అమానుషంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రామచంద్రరెడ్డి మాట్లాడుతూ సమస్యను సామరస్య పూర్వకంగా చర్చించి పరిష్క రించకుండా అంగన్వాడీ మహిళా ఉద్యమాన్ని అమానుషంగా అణచివేయడం దారుణమని ద్వజమెత్తారు. తక్షణం వారిని విడుదల చేసి సమస్యను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ మాట్లాడుతూ అంగన్వాడీల పట్ల ప్రభుత్వ అమనుషానికి వ్యతిరేకంగా ప్రజలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు ప్రభాకర్‌రెడ్డి, రఘునాథ్‌, సిపిఐ నాయకులు దేవా, ఎఐటియుసి నాయకులు తిరుమల, మస్తాన్‌, సిఐటియు నాయకులు జయరాం, రమణ, కాంగ్రెస్‌ నాయకులు పవన్‌ పాల్గొన్నారు. బి.కొత్తకోట : అంగన్వాడీలపై ఎస్మా చట్టం తేవడం, విజయవాడలో అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ఎఐటియుసి తంబళ్లపల్లి నియోజకవర్గం అధ్యక్షులు ఎస్‌.సలీం బాషా, కార్యదర్శి బి.వేణు గోపాల్‌రెడ్డి, జి.రఘునాథ్‌ డిమాండ్‌ చేశారు. అంగన్వాడీల అరెస్టుకు నిరసనగా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికార దాహంతో అధికారంలోకి వచ్చాక తెలంగాణ కన్నా అదనంగా రూ.వెయ్యి వేతనం పెంచుతామని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక అంగన్వాడీలను రోడ్లపాలు చేశాడని విమర్శించారు. కార్యక్రమంలో ఎఐటియుసి మండల కార్యదర్శి జి.రఘునాథ్‌, మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.బాలకృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్‌ అలీ, నాయకులు గంగులప్పా, బాబు, రియాజ్‌ పాల్గొన్నారు. రాజంపేట అర్బన్‌ : రాజ్యాంగ బద్ధంగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తుంటే సమ్మెను అణిచివేస్తూ వారిపై నిర్బంధాలను విధిస్తూ రాజ్యాంగ విలువలు తెలియని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహం వద్ద వామపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పి.మహేష్‌, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్‌ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని 42 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు రాజ్యాంగ బద్ధంగా చీఫ్‌ సెక్రటరీ నుంచి కింద ఉన్న ఐసిడిఎస్‌ సిడిపిఒలకు, సూపర్వైజర్లకు సమ్మె నోటీసు అందించి సమ్మె చేస్తుంటే వారి న్యాయమైన సమస్యలు తీర్చకుండా చేస్తున్నటువంటి సమ్మెను భయాందోళనలతో, బెదిరింపులతో విచ్చిన్నం చేయాలని చూడడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఉద్యోగాల నుంచి తీసివేస్తానని బెదిరించడం సరికాదని తెలిపాఉ. కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎం.శివరామకృష్ణ, సహాయ కార్యదర్శి ఎమ్మెస్‌ రాయుడు, పట్టణ కార్యదర్శి ఇ.సికిందర్‌, నాయకులు నాగేశ్వరావు పాల్గొన్నారు.అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం : బిఎస్‌పిపుల్లంపేట : అంగనవాడీ కార్మికులు వేతనాలు పెంచమంటే విజయవాడలో అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రైల్వేకోడూరు బహుజన సమాజ్వాది పార్టీ ఇన్‌ఛార్జి సుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలు అని కూడా చూడకుండా అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్లో నిర్భందిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే అంగన్వాడీ కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే మరింత జటిలం చేసేలా ప్రభుత్వ వైఖరి ఉందని వెంటనే వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి అంగన్వాడీలు సరైన బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు. ప్రభుత్వం కళ్లు తెరచి అంగన్వాడీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

➡️