అందని పౌష్టికాహారం

Jan 17,2024 23:35
పిఠాపురం మండలం ఎఫ్‌కె.పాలెం గ్రామానికి

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

పిఠాపురం మండలం ఎఫ్‌కె.పాలెం గ్రామానికి చెందిన ఎం.సునీత కుమారుడు రామ్‌ తేజ స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో ఫ్రీ స్కూల్‌ విద్యార్థి. ఈ చిన్నారికి ఈనెలలో ఇవ్వాల్సిన గుడ్లు పాలు, బాలావృతం అందలేదు. ఇలా అనేకమంది లబ్ధిదారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారం, ఇతర సరుకులు నెల రోజులుగా అందడం లేదు.అంగన్‌వాడీలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 37 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెలరోజులు పైబడి పలు కేంద్రాలు తెరుచుకోవడం లేదు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల తల్లులు సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా పౌష్టికాహారం అందని పరిస్థితి నెలకొంది. ఓ పక్క సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుండగా మరోవైపు పౌష్టికాహారం అందిం చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. సచివాల య సిబ్బంది ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నా మని అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో 50 శాతానికి పైగా లబ్ధిదారులకు నేటికీ సరుకులు అందని పరిస్థితి నెలకొంది.

37 రోజులుగా సమ్మె

తెలంగాణ రాష్ట్రం కంటే రూ.1000 వేతనం అదనంగా ఇస్తామన్న సిఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని, అలాగే ఇతర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు 38 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలకు పిలిచినా పరిష్కరించాల్సింది పోయి ప్రభుత్వం బెదిరింపు ధోరణితో వ్యవహరిస్తుంది. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా కేంద్రాలను పగలగొట్టి తెరిపించే ప్రయత్నం చేసింది. చివరకు అంగన్‌వాడీలకు వర్తించని ఎస్మాను సైతం ప్రయోగించింది. అయినా వర్కర్లు, ఆయాలు పట్టు వదలకుండా సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మెను విరమింప చేసేందుకు సానుకూలంగా స్పందించాల్సిన ప్రభుత్వం కేంద్రాలను సచివాలయ సిబ్బంది ద్వారా తెరిపిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సెంటర్లను తెరవాల్సి ఉన్నా సచివాలయ సిబ్బంది తెరవడం లేదు. మరోవైపు పౌష్టికాహారం కోసం కేంద్రాల చుట్టూ లబ్ధిదారులు కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అందడం లేదు. గుడ్లు, పాలు, ఇతర సరుకులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. ప్రీ స్కూల్‌ ద్వారా విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన పిల్లలు ఇళ్ళకే పరిమితమవుతున్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న టేక్‌ హోమ్‌ రేషన్‌ (టీహెచ్‌ఆర్‌) కిట్‌లో ఒక కిలో చోడి పిండి, పావు కిలో చొప్పున బెల్లం, ఖర్జూరం, చిక్కీలు, ఒక కిలో అటుకులు ఇస్తుండగా కేంద్రాల్లో నిలవ ఉండిపోవడం వల్ల కిట్లు పాడవుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీల సమ్మెను విరమింప చేసి సకాలంలో పౌష్టికాహారం అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు.

పెట్టిన ఇండెంట్లు ఇవీ..

కాకినాడ జిల్లాలో బాలింతలు, గర్భిణీలు 16,390 మంది ఉండగా వీరికి ప్రతినెలా ఒక్కొక్కరికి నెలకు 25 గుడ్లు చొప్పున ఇస్తున్నారు. ఈ నెలలో 1,96,680 గుడ్లు ఇవ్వాలని అధికారులు ఇండెంట్‌ పెట్టారు. మూడు కిలోలు చొప్పున రైస్‌ ప్యాకెట్లు 49,170, కిలో కందిపప్పు ప్యాకెట్లు 16,390, ఒక లీటరు ఆయిల్‌ ప్యాకెట్లు 16390, 81950 లీటర్ల పాలు ఇవ్వాలని ఈనెలలో ఇండెంట్‌ పెట్టారు. అలాగే ఏడు నెలల నుంచి 36 నెలల మధ్య ఉన్న చిన్నారులు 44,675 మంది ఉండగా వారికి 5,36100 గుడ్లు, 44,675 బాలామృతం, 1,11,688 లీటర్ల పాలు ఇవ్వాలని ఇండెంట్‌ పెట్టారు.

సరుకులు నేటికీ ఇవ్వలేదు

ప్రతి నెల 10వ తేదీ లోపు పాలు, గుడ్లు, టిహెచ్‌ఆర్‌ కిట్‌, కందిపప్పు, ఆయిల్‌, బియ్యం అందేవి. ఈ నెలలో ఇంకా ఎవరూ ఇవ్వలేదు. కొన్నిచోట్ల సచివాలయ సిబ్బంది సరు కులు ఇచ్చినట్లు చెబుతున్నారు. గతనెలలో టిహెచ్‌ ఆర్‌ కిట్‌ ఇవ్వలేదు. ప్రభుత్వం అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను పూర్తిగా పరిష్కరించి మాకు సరుకులు అందేలా తక్షణమే చర్యలు తీసుకోవాలి.

-మాతా ప్రమీల, గర్భిణి, భీమ్‌ నగర్‌, నరసింగపురం, పిఠాపురం మండలం

➡️