అంబాని, అదానీలకు దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వం

కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న ఎంఎల్‌సి ఐవి, ప్రజా సంఘాల నాయకులు తదితరులు

ప్రజాశక్తి-అమలాపురం

అంబాని, అదానీలకు దేశ సంపదను మోడి ప్రభుత్వం దోచిపెడుతోందని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు విమర్శించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్మిక కర్షక ఐక్యత దినోత్సవం సందర్భంగా డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు కౌలురైతు సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంఎల్‌సి ఐవి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక కర్షక ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలన్నారు. దేశంలో మోడీ ప్రభుత్వం అంబాని, అదానీలకు దేశ సంపదను కట్టబెట్టడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీల సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తుందని తక్షణం వీరు సమస్యలు పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చొరవ చూపాలని అన్నారు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఇదే నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కడాన్ని కులం పేరుతో, మతం పేరుతో దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరావు సిఐటియు జిల్లా కార్యదర్శులు కె.కృష్ణవేణి, జి.దుర్గాప్రసాద్‌, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి పీతల రామచంద్రరావు మాట్లాడుతూ నాలుగు లేబర్‌ కోడ్‌ లను తక్షణం రద్దు చేయాలని, కనీస వేతనాన్ని అమలు చేయాలని, కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, ప్రయివేటీకరణ విధానాలు విడనాడాలని, విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆపాలని, అంగన్‌వాడీల సమ్మెను విరమింప చేయాలని, ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలనీ డిమాండ్‌ చేశారు. పరిశ్రమలు నెలకొల్పాలని ఉపాధి హామీ చట్టానికి 200 రోజులు పనులు, రూ.600 వేతనం ఇవ్వాలని, కౌలు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.జిల్లాలో డ్రైనేజ్‌ వ్యవస్థని ఆధునికీకరణ చేయాలని, మిచౌంగ్‌ తుఫాను వలన నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తక్షణం అందించాలని డిమాండ్‌ చేశారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పలువురు నాయకులు అన్నారు. అదానీ, అంబానీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను కారు చౌకగా కట్టబెడుతుందని సిఐటియు వ్యవసాయ, కార్మిక సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో పి.అమూల్య, కె.బేబీ గంగారత్నం, ఇసుక పట్ల మంగాదేవి, తాడి శ్రీరామ్‌ మూర్తి, పర్వతాలు, జి.దైవకృప, విజయ, రత్నకుమారి, తోమ్మండ్రు గోపి, కె.శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

➡️