అక్రమ వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌ చేయాల్సిందే

Dec 10,2023 20:56

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :   విజయనగరం ఒకటవ డివిజన్‌ పరిధిలోని అయ్యప్పనగర్‌ లో పూసర్ల మధు సూదన రావు అక్రమంగా స్వాతీ ప్యూర్‌ఫైర్‌ వాటర్‌ ప్లాంట్‌ ను నడుపుతున్నారని, వెంటనే ప్లాంట్‌ను సీజ్‌చేయాలని పట్టణపౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు, అయ్యప్ప నగర్‌ పోరాట కన్వీనర్‌ యుఎస్‌ రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈప్లాంట్‌కు భూగర్బాజల శాఖ అధికారులుగాని, మున్సిపల్‌ అధికారులుగాని, రెవెన్యూ అధికారులుగాని అనుమతులు ఇవ్వలేదని, అయినా అక్రమంగా నీటివ్యాపారం చేస్తూ ప్రభుత్వాన్ని మోసగిస్తున్నారని తెలిపారు. ఆదివారం స్థానిక ఎల్‌ బి జి భవనం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ అక్రమ ప్లాంట్‌ వల్ల అయ్యప్ప నగర్‌ లో ప్రజలు, సొంత ఇంటి దార్లు బోర్లు ఇంకిపోయి నీరు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అక్రమ వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌ చేయాలని అయ్యప్ప నగర్‌ కాలనీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూన్‌ 6న ప్రజలు నిరసన తెలియ జేస్తే, ఆ కాలనీ అసోసియేషన్‌ కార్యదర్శి సుధీర్‌,నాయకులు యు ఎస్‌. రవి కుమార్‌, రెడ్డి శంకరరావుపై తప్పడు ఎస్సీ,ఎస్టీ అట్రా సిటీ కేసును తన భార్య స్వాతీ, తన బావ మరిది సంతోష్‌ లతో అక్రమంగా పెట్టింటారని తెలిపారు. వాటర్‌ ప్లాంట్‌ కోసం 500 గజాల ప్రభుత్వ గెడ్డను మధు ఆక్రమించారని తహశీల్దారు 6ఎ నోటీస్‌ ఇచ్చినా ఇప్పటివరకూ ఎటువంటి చర్యలూ లేవన్నారు. వాటర్‌ ప్లాంట్‌ అక్రమమని జున్‌ 6న మున్సిపల్‌ అధికారులు సీజ్‌ చేస్తే, తాళాలు బద్దలు గొట్టి అదే రోజునుండి అక్రమంగా వాటర్‌ ప్లాంట్‌ నడుపుతున్నట్లు ధ్రువీకరించిన అధికారులు ఏడు నెలలైనా నేటికీ సీజ్‌ చెయ్యకుండా తాత్సారం చేయడం సరైనది కాదన్నారు. కావున తక్షణమే అక్రమ వాటర్‌ ప్లాంట్‌ సీజ్‌ చేసి, యజమాని పూసర్ల మధు సూధన రావు ను తక్ష్ణమే అరెస్టు చేయాలని కోరుతూ ఈనెల 11 నుంచి ఆందోళనా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.11న గాంధీ విగ్రహం వద్ద నిరసన, 12, 13న సచివాలయాల్లో వినతులు 26 ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని, ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు కంది త్రినాథ్‌, రంబ శ్రీను వాసరావు,సుదీర్‌ పాల్గొన్నారు.

➡️