అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేయడం తగదు

Feb 7,2024 22:16
ఫొటో : ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న దళిత, గిరిజన నాయకులు

ఫొటో : ఆర్‌డిఒకు వినతిపత్రం అందజేస్తున్న దళిత, గిరిజన నాయకులు
అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేయడం తగదు
ప్రజాశక్తి-కావలి : స్థానిక శాసనసభ్యుల వల్ల పోలీసు అధికారులు అట్రాసిటీ కేసులను నిర్వీర్యం చేయడం తగదని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి పేర్కొన్నారు. బుధవారం కావలి పట్టణంలోని ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్‌డిఒ శీనానాయక్‌కు వినతిపత్రం అందించారు. అందుకు స్పందించిన ఆర్‌డిఒ, డిఎస్‌పి, కలెక్టర్‌తో మాట్లాడి న్యాయం చేస్తామని తెలియజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి మాట్లాడుతూ ప్రతి అట్రాసిటీ కేసులో కావలి డివిజన్‌లో స్థానిక శాసనసభ్యులు పోలీసులపై ఒత్తిడి చేసి కేసు కట్టకుండా చేస్తున్నారని తెలిపారు. జనవరి 23వ తేదీన బట్రకాగొల్లులో జరిగిన యానాది కులస్థుడు అయిన చేవూరి సురేష్‌పై అదే గ్రామానికి చెందిన కొందరు దాడిచేసి, తలపై పెద్దగాయం చేయగా, హాస్పటల్లో ఇప్పటికీ చికిత్స పొందుతున్నారని తెలిపారు. అయినా అల్లూరు ఎస్‌ఐ కేసులు కట్టలేదన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా స్థానిక శాసనసభ్యుల ఒత్తిడి వల్ల కేసులు కట్టడం లేదన్నారు. రాజకీయ ఒత్తడి తాము తట్టుకోలేమని అల్లూరు ఎస్‌ఐ చెబుతున్నారని తెలిపారు. అలాగే జనవరి 24న ఇస్కపల్లి గ్రామానికి చెందిన గాలి నివాస్‌ అనే దళితుడిని అల్లూరు ఎస్‌బిఐలో రికవరీ అధికారిగా ఉన్న అతన్ని తరిమితరిమి కొట్టారని, బ్యాంక్‌లో కూడా కొట్టారని తెలిపారు. అయినా కూడా వారిపై కేసు కట్టకుండా ఉంటున్నారని, ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఈ విధంగా కావలి డివిజన్‌లో దళిత, గిరిజనులు అట్రాసీటి కేసులు ఫిర్యాదు చేస్తే కేసులు కట్టనీయకుండా అడ్డుపడుతున్నారని తెలిపారు. పేద వర్గాలకు ద్రోహం చేస్తున్నారని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి నాలుగురోజుల క్రితం వర్చువల్‌ మీటింగ్‌లో మాట్లాడుతూ దళితులకు ద్రోహం జరిగింది వాస్తవమేనని అట్రాసిటీ కేసుల్లో అత్సుత్యాహం చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చారని, అట్రాసిటీ కేసుల్లో పూర్తిగా విఫలమయ్యామని వారికి క్షమాపణ చెబుతున్నామని తెలిపినట్లు తెలిపారు. వాస్తవంగా స్థానిక శాసనసభ్యులు అట్రాసిటీ కేసులను నీరుగారుస్తున్నారని తెలిపారు. దళిత, గిరిజనులకు రూ.500 ఇస్తే ఓట్లు వేస్తారని తెలపడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో కోవూరు బాబు, గిరిజన నాయకుడు చౌటూరి వెంకటరత్నం, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు జరుగుమల్లి విజయరత్నం, గాలి రాజ, డాక్టర్‌ వేణుగోపాల్‌, కాకిమల్లి, మస్తానయ్య, ముక్కు మోహన్‌రావు పాల్గొన్నారు.

➡️