అధికారులపై ఆక్రోశం

Jan 29,2024 21:09

ప్రజాశక్తి-రామభద్రపురం  : స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశాన్ని సోమవారం ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ప్రారంభం నుంచే అధికారుల పనితీరును ఎండగడుతూ ప్రతిపక్ష టిడిపి సర్పంచ్‌, ఎంపిటిసి సభ్యులు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా పంచాయతీ రాజ్‌ ఎఇ రమేష్‌ పనితీరుపై ప్రతిపక్ష సభ్యులతో అధికార పార్టీ సభ్యులు, ఎంపిపి సైతం గొంతుకలిపి, విరుచుకుపడ్డారు. భూశాయవలసలో ఆర్‌బికె భవనాన్ని ప్రారంభించి, నెలలు కావస్తున్నా పంచాయతీరాజ్‌ ఎఇ నిర్లక్ష్య వైఖరితో బిల్లులు కాలేదని మామిడివలస ఎంపిటిసి మడక తిరుపతిరావు నిలదీశారు. జీతాలు రెండు రోజులు ఆలస్యమైతే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే మీరు, నిర్మాణాలు పూర్తి చేసి నెలలు గడుస్తున్నా చేసిన పనులకు ఎందుకు బిల్లులు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. బిల్లులు పెండింగ్‌, ఎంబుక్‌ రికార్డింగులపై ఎంపిపి చొక్కాపు లక్ష్మణరావు స్పందిస్తూ ఎఇ పనితీరు బాగాలేదని, స్థానికంగా నివాసం ఉండకుండా, సమయపాలన పాటించకుండా ఇబ్బందులు పెడుతున్నట్లు తనకు కూడా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. పనితీరు మెరుగు పరుచుకోవాలని సూచించారు.రొంపల్లి, రామభద్రపురం ఎంపిటిసిలు భవిరెడ్డి శంకరరావు, చంద్రరావు, నర్సాపురం సర్పంచ్‌ కోట వెంకటనాయుడు తమ పరిధిలో ఉన్న తీరని సమస్యలపై అధికారులను నిలదీశారు. సమావేశాల్లో లేవనెత్తడమే తప్ప పరిష్కరించడం లేదని, సంతకాలు చేసి వెళ్లిపోవడమే ఉత్తమమని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు-నేడులో భూశాయవలస హైస్కూల్‌ అదనపు గదులు నిర్మాణాలు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కాలేదన్నారు. రొంపల్లి, వంగపండువలస పాఠశాలల్లో గదులు వర్షానికి కారేస్తున్నా పనులు చేయలేదు సరికదా ఇక్కడ కేటాయించిన నిధులు అనకాపల్లి జిల్లాకు తరలిపోవడం ఏమిటని ప్రశ్నించారు. రావివలస సర్పంచ్‌ కుమారి తమ గ్రామంలో పాఠశాల నిర్మాణం పూర్తి చేసి నెలలు కావస్తున్నా బిల్లులు చెల్లించడం లేదని ప్రశ్నించారు. దీనికి ఎంపిపి స్పందిస్తూ వెంటనే నిర్మాణాలు వేగవంతం చేయాలని నాడు-నేడు డిఇఇ, ఎంఇఒని ఆదేశించారు. తహశీల్దార్‌ సులోచనారాణి మాట్లాడుతూ రీ సర్వే సమస్యలు త్వరలోనే చక్కబడతాయని, తప్పులు నమోదైన పట్టాదారు పాసుపుస్తకాల్లో మార్పులు చేసి మళ్లీ పంపిణీకి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతిఒక్కరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రామభద్రపురం ఎంపిటిసి భవిరెడ్డి చంద్ర, కో ఆప్షన్‌ సభ్యులు స్థానికంగా పేదలకు అర్హులైనా పట్టాలు రావడం లేదని, గతంలో మంజూరైన వారికి, డబ్బున్న వారికే వస్తున్నాయని సమావేశంలో ప్రస్తావించారు. తహశీల్దార్‌ స్పందిస్తూ ప్రభుత్వ నిబంధనలను అనుసరించే పట్టాలిస్తున్నామని, ప్రభుత్వ స్థలం చాలా ఉందని అర్హులు ఎవరైనా ఉంటే తన దృష్టిలో పెడితే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సమగ్ర భూ సర్వే చాలా తప్పులతడకగా జరిగిందని, ఇనాం భూములను కూడా వేరే వారి పేరు మీద నమోదు చేశారని మడక తిరుపతిరావు నిలదీశారు. సాంకేతిక లోపాల్ని సరిచేస్తున్నామని, ఎవరైనా తప్పులు జరిగినట్లు ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటామని తహశీల్దార్‌ సమాధానం చెప్పారు. గత సమావేశాల్లో లేవనెత్తిన సమస్యలకు ఈ సమావేశానికి కూడా పరిష్కారం చూపడంలో కొందరు అధికారులు నిర్లక్ష్యం చూపారని సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సమావేశంలో ఎంపిడిఒ రమామణి, జెడ్‌పిటిసి అప్పికొండ సరస్వతి, వివిధ శాఖల అధికారులు, సీనియర్‌ సహాయకులు చొక్కాపు శ్రీరాములునాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️