అధిక లోడుతో వెళ్తున్న లారీలు అడ్డగింత

మొయిన్‌ రోడ్డుపై ఆందోళన చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి- మునగపాక

పరిమితికి మించి అధిక లోడుతో వెళుతున్న లారీలను గురువారం స్థానిక మెయిన్‌ రోడ్డుపై అఖిలపక్ష నాయకులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. అధిక లోడుతో వెళ్తున్న భారీ వాహనాలపై తక్షణం చర్యలు చేపట్టాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు మొల్లేటి సత్యనారాయణ, గ్రామ రైతు సంఘం అధ్యక్షులు ఆడారి మహేష్‌, పిఎసిఎస్‌ అధ్యక్షులు కోనపల్లి రామ్మోహన్‌రావు మాట్లాడుతూ ప్రమాదాలకు నిలయంగా మారిన అనకాపల్లి- అచ్చుతాపురం రోడ్డు మార్గంపై 50 టన్నుల నుండి 60 టన్నుల వరకు క్వారీ రాళ్లను తీసుకెళుతున్న లారీలు ప్రయాణికులకు ముచ్చమటలు పట్టిస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే రోడ్డు మార్గం పూర్తిగా శిథిలం కావడం తద్వారా గుంతలు ఏర్పడటంతో లారీలపై ఉన్న రాళ్లు వాహన దారులపై పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఇటీవల నాగులాపల్లి జేఎంజె స్కూల్‌ సమీపంలో పెద్ద రాయి లారీ నుండి జారీ పడటంతో పెను ప్రమాదం తప్పిందని వాపోయారు. అనకాపల్లి బైపాస్‌ జంక్షన్‌లో హెచ్చరిక బోర్డులు పెట్టిన వాటిని బేఖాతరు చేస్తూ లారీలు యథేచ్ఛగా అధిక లోడుతో తిరుగుతున్నాయని తెలిపారు. వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. సంబంధిత అధికారులు వచ్చి సమస్య పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు. ట్రాఫిక్‌ స్తంభించి పోవడంతో పోలీసులు కలుగజేసుకొని వాహన యజమానులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆడారి లక్ష్మణరావు, పెంటకోట ఆదినారాయణ నాయుడు, జనసేన నాయకులు సూరిశెట్టి అప్పలనాయుడు, మల్ల రామ జగన్నాథం, దాడి వీరబాబు, దొడ్డి వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️