అన్నం పెడుతున్నా అర్ధాకలే..!

Mar 1,2024 23:45

ప్రజాశక్తి – చిలకలూరిపేట : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు బడిగా రాగానే రాగిజావతోపాటు మధ్యాహ్నం వేళ భోజనం అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల తరబడి బిల్లులు, గౌరవ వేతనాలు అందక అర్ధాకలితో అలమటిస్తున్నారు. పట్టణంలో 84 పాఠశాలల్లోని 2488 మంది విద్యార్థులకు 105 మంది మధ్యాహ్న భోజన కార్మికులు భోజనం అందిస్తున్నారు. వీరికి నాలుగు నెలల నుండి బిల్లులు బకాయిలున్నాయి. దీంతో అప్పులు చేసి పథకాన్ని నిర్వహిస్తున్నారు. దీనికితోడు ఐదేళ్ల కిందట నిర్ణయించిన మెనూ ధరలకు, తాజాగా ఉన్న ధరలకు పొంతనే లేదని గ్యాస్‌ ధరలు కూడా రెండింతలు పెరిగాయని వాపోతున్నారు. ప్రస్తుతం 1-5 తరగతుల వరకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.7.40 ఇస్తుండగా 6-10 తరగతుల వారికి రూ.8.75 చొప్పున ఇస్తున్నారు. దీన్ని రూ.12… రూ.15గా పెంచాలని నిర్వాహకులు కోరుతున్నారు. దీంతోపాటు తమకు ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల గౌరవవేతనం సరిపోవడం లేదని, ఎన్నికల హామీ ప్రకారం రూ.10 వేలకు పెంచాలని అంటున్నారు. కోడిగుడ్డు ఉడకబెట్టినందుకు 10 పైసలు, రాగిజావ కాచినందుకు 10 పైసులు ఇస్తామని రెండేళ్ల కిందట ప్రకటించినా ఇంత వరకు ఇవ్వలేదని అంటున్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం దృష్టి సారించాలని వేడుకుంటున్నారు. ప్రతినెలా గౌరవవేతనంతోపాటు బిల్లులు మంజూరు చేయాలని, ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు పెంచాలని కోరుతున్నారు.

➡️