అన్నదాతలపై అలసత్వం

Dec 11,2023 23:16
ఇప్పటికైనా స్పందించి

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి

తుపాను కారణంగా జిల్లాలో వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులతో నానాపాట్లు పడ్డా రైతున్నలు నేడు పంట చేతికందే చివరి దశలో తుపాను ప్రభావంతో కన్నీటిని మిగిల్చింది. అక్కడక్కడా ఉన్న పంటను ఎలాగైనా దక్కించుకునే పనిలో ప్రస్తుతం రైతులు నిమగమయ్యారు. పొలాల్లో నీరు నిల్వ ఉండిపోగా పంటను మెరక ప్రాంతాలకు తీసుకొచ్చి ఎండబెట్టుకునే పనిలో ఉన్నారు. అయితే రైతులకు ప్రస్తుత దశలో బరకాలు అవసరం చాలా ఎక్కువగా ఉంది. గతంలో ప్రభుత్వం రాయితీపై బరకాలు అందించింది. ప్రస్తుత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం రైతులకు రాయితీపై ఇచ్చే బరకాల మాటనే మరచిపోయింది. దీంతో అన్నదాతలకు అదనపు భారం తప్పడం లేదు. రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ఎన్నో చేస్తున్నామని గొప్పలు చెబుతున్న పాలకులు ఆచరణలో రైతుల సమస్యలను విస్మరిస్తున్నారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో 2.6 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరిని సాగు చేయగా ఇప్పటి వరకు 60 శాతం కోతలు పూర్తయ్యాయి. తుపాను ప్రభావంతో మూడు రోజుల పాటు కురిసిన వర్షానికి సుమారు 42 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే వాస్తవ పరిస్థితులను గమనిస్తే నష్టం మరో 40 వేల ఎకరాల్లో ఉంటుం దనేది అంచనా. అయితే నిబంధనలు మేరకు ఎకరాకు 33 శాతానికి పైగా నష్టం జరిగితేనే రైతు లకు పరిహా రం అందుతుంది. దీంతో మిగిలి ఉన్న పంటను రైతులు మెరకు ప్రాంతా లకు తీసుకొచ్చి ఎండ బెడు తున్నారు. ధాన్యం రాశుల్లో నీరు చేరడంతో తేమ శాతాన్ని తగ్గించేందుకు నాలుగు రోజులుగా ఆరబెడుతున్నారు. దీంతో బరకాలు అవసరం చాలా ఉంది. ప్రస్తుతం వీటికి డిమాండ్‌ అధికంగా ఉండడంతో ఒక్కో బరకానికి రూ.150 అద్దె తీసుకుంటున్నారు. ఎకరాకు 4 నుంచి 5 బరకాలు అవసరం ఉంటుండడంతో రైతులకు అదనపు ఖర్చు తడిసి మోపుడవుతుంది. రోజుల తరబడి ఆరబోత చేయాల్సి వస్తుండంతో రూ.2 వేలు నుంచి 3 వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అద్దెలు కాకుండా కొనుగోలు చేయాలంటే ఒక్కో పెద్ద టార్పాలిన్‌కు రూ.3 వేలు నుంచి రూ.4 వేలు వెచ్చించాల్సి వస్తుంది. ఇంత భారం భరించలేని రైతులు ఎరువుల సంచులున్న బరకాలను రూ.1000 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. గతంలో 50 శాతం రాయితీపై ఒక్కక్కరికి 4 టార్పాలిన్లు ప్రభుత్వం అందించేదని, వైసిపి ప్రభుత్వం ఇవ్వడం లేదని రైతులు పేర్కొంటున్నారు. గతంలో ఖరీఫ్‌కు ముందే ఏటా టార్పాలిన్లు ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందించి రాయితీ బరకాలు ఇవ్వాలని కోరుతున్నారు.

➡️