అన్నదాత గుండెల్లో ‘తుపాను’..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

అన్నదాత గుండెల్లో తుపాను రేగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఖరీఫ్‌ పంట గట్టెక్కుతుందా అనే బెంగ కర్షకులను వెంటాడుతోంది. రెండు జిల్లాల్లోనూ ఇంకా సగానికిపైగా ఖరీఫ్‌ మాసూళ్లు పూర్తి కాకపోవడంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా ఖరీఫ్‌లో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. గడిచిన పది రోజులుగా ఖరీఫ్‌ మాసూళ్లు కొనసాగుతున్నాయి. తాడేపల్లిగూడెం, పెంటపాడు, ఉంగుటూరు వంటి మండలాల్లో అత్యధికంగా మాసూళ్లు పూర్తయినప్పటికీ మిగిలిన మండలాల్లో సగం మాసూళ్లు కూడా పూర్తికాని పరిస్థితి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారనుందని, రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్‌ నాలుగు నుంచి ఆరో తేదీ వరకూ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. మబ్బులు, చినుకులతో వాతావరణం భయ పెడుతోంది. వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో రైతులకు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. యంత్రాల ద్వారా కోతలు కోస్తుండటంతో ధాన్యం ఆరబెట్టాల్సిన పరిస్థితి ఉంది. వాతా వరణం సరిగా లేకపోవడంతో ధాన్యం ఆరడానికి కనీసం ఐదు రోజులకుపైగా పడుతోంది. మబ్బులుగా ఉండటంతో ధాన్యం తొందరగా ఆరడం లేదు. ఒకపక్క తుపాను హెచ్చరికలు, మరోపక్క కళ్లాల్లో ధాన్యం చూసి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వర్షాలు కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ఎకరాకు రూ.30 వేలకుపైగా రైతులు పెట్టుబడి పెట్టారు. మూడెకరాలు సాగు చేసిన రైతు కనీసంగా రూ.లక్ష వరకూ పెట్టుబడి పెట్టిన పరిస్థితి ఉంది. జిల్లాలో మూడొంతులు మంది కౌలురైతులే వరిసాగులో ఉన్నారు. వీరికి బ్యాంకులు ఎటువంటి రుణాలూ ఇవ్వలేదు. దీంతో ప్రయివేటు వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టారు. పంట సక్రమంగా చేతికొస్తే రబీ పెట్టుబడులకు ఇబ్బంది ఉండదని ఎన్నో ఆశలు పెట్టు కున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వెంటాడుతున్న ప్రకృతి వైప రీత్యాలతో రైతులు నలిగిపోతున్నారు. తుపాను హెచ్చరికలతో పంట చేతికొస్తుందో, లేదోననే భయం అన్నదాతకు నిద్ర లేకుండా చేస్తోంది. ఏదైనా తేడా వస్తే కౌలురైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటేనే అన్నదాతకు న్యాయం రెండు జిల్లాల్లోనూ ఒకటి, రెండు మండలాల్లో తప్ప మాసూళ్లు చేసిన ధాన్యం అంతా కళ్లాల్లోనే ఉంది. ఎక్కడ చూసినా ధాన్యం ఆరబెట్టే దృశ్యాలే కన్పిస్తున్నాయి. ఇప్పటి వరకూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం సైతం నామమాత్రంగానే ఉంది. వాతావరణం మబ్బుగా ఉండటంతో ధాన్యం సరిగా ఆరడం లేదు. ఆరబెట్టిన ధాన్యం వెంటనే కొనుగోలు చేసేలా అధికారులు ఎక్కడికక్కడే చర్యలు తీసుకోవాలి. ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడాలి. తేమశాతంలో మిల్లర్ల నుంచి వచ్చే ఇబ్బందులను పరిష్కరించాలి. అప్పుడే రైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. ధాన్యం కొనుగోలులో శ్రద్ధ తీసుకుంటేనే రైతులను విపత్తు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

➡️