అన్నదాత లను ఆదుకుంటాం : రాజన్నదొర

Dec 8,2023 20:52

  ప్రజాశక్తి – సాలూరు  :  మిచౌంగ్‌ తుపాను కారణంగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాను వల్ల నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువ పంటనష్టం జరిగిందని, ఉత్తరాంధ్రా జిల్లాల్లో పెద్దగా పంట నష్టం జరుగలేదన్నారు. వరి చేలు కోసిన తర్వాత వర్షాల వల్ల నష్టం జరిగితే పరిహారం రాదని, కోత కోయని వరి పంటకు నష్టం వాటిల్లితే పరిహారం అందుతుందని చెప్పారు. పంటల నష్టంపై సర్వే జరుగుతున్నదని, నివేదికలు రాగానే ప్రభుత్వం నష్టపరిహారం పంపిణీ చేస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోలులో ఇంతవరకు ఉన్న నిబంధనలు మార్చాలని సిఎంను కోరనున్నట్లు చెప్పారు. తుపాన్‌ నష్టంపై కేంద్రం కూడా సహకరిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.టిడిపి హయాంలో బడ్జెట్‌ కేటాయింపు లేదుపట్టణంలోని వైటిసిలో నిర్వహిస్తున్న గిరిజన గర్భిణుల హాస్టల్‌ నిర్వహణకు సంబంధించి గతంలో టిడిపి ప్రభుత్వం బడ్జెట్‌ కేటాయింపు చేయలేదని చెప్పారు. దాని వల్లనే హాస్టల్‌ నిర్వహణలో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. 2018లో ఏజెన్సీ ప్రాంతంలో గిరిశిఖర గ్రామం శిరివర నుంచి కిందకు తీసుకొస్తున్న గిరిజన గర్భిణీ మార్గమధ్యంలో ప్రసవించిందని, దీనిపై జాతీయ మానవహక్కుల కమిషన్‌ స్పందించి రాష్ట్ర ప్రభుత్వానికి, ఐటిడిఎ పిఒకు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో అప్పటి ఐటిడిఎ పిఒ గిరిజన గర్భిణుల హాస్టల్‌ ఏర్పాటు చేయాలని సొంత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి గర్భిణుల హాస్టల్‌ నిర్వహణకు బడ్జెట్లో కేటాయింపులు చేసి వుంటే ఇప్పుడిన్ని ఇబ్బందులు వచ్చేవి కాదన్నారు. ఇప్పుడు దీని ఆవశ్యకత గుర్తించి బడ్జెట్‌లో చేర్చేలా కృషి చేస్తానని చెప్పారు. అలాగే జాతీయ హెల్త్‌ మిషన్‌ నుంచి నిధులు మంజూరయ్యేలా ప్రతిపాదన చేయాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ని కోరనున్నట్లు చెప్పారు. టిడిపి హయాంలో నియోజకవర్గంలో చేపట్టిన రోడ్డు నిర్మాణాలు ఎక్కడున్నాయో చూపించాలని కోరారు. కాంగ్రెస్‌, వైసిపి ప్రభుత్వం హయాంలోనే రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నా యని చెప్పారు. గతంలో తోణాం, మామిడిపల్లి రోడ్లను టిడిపి ప్రభుత్వం ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. వంద పడకల ఆసుపత్రి, కందులపధం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి టిడిపి నాయకులు వదిలేశారని అన్నారు. శివరాంపురం వంతెన నిర్మాణంపై గతంలో తాను ఎప్పుడూ ఎన్నికల హామీ ఇవ్వలేదని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలోనే శివరాంపురం వంతెన అవసరాన్ని గుర్తించి నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. కాంట్రాక్టరు అకాల మరణంతో పనులు మధ్యలో నిలిచిపోయాయని చెప్పారు. మక్కువ రోడ్డును డబుల్‌ రోడ్‌ చేయడానికి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ రోడ్డు నిర్మాణానికి సంబంధించి బిల్లులు మంజూరయ్యేలా సిఎంతో మాట్లాడుతానని చెప్పారు. మిగిలిన పని పూర్తయ్యేలా ప్రతిపాదన పంపించనున్నామని రాజన్నదొర చెప్పారు. విలేకరుల సమావేశంలో అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షులు జర్జాపు ఈశ్వరరావు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, పట్టణ అధ్యక్షుడు వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్‌ కన్వీనర్‌ గిరిరఘు, కౌన్సిలర్‌ గొర్లి వెంకటరమణ, వైసిపి నాయకులు తాడ్డి యశోదకృష్ణ పాల్గొన్నారు.

➡️