అన్నీ కాకమ్మ లెక్కలే…!న(క)ష్టం చూడరు..!

Dec 8,2023 21:30
అన్నీ కాకమ్మ లెక్కలే...!న(క)ష్టం చూడరు..!

అన్నీ కాకమ్మ లెక్కలే…!న(క)ష్టం చూడరు..!ప్రజాశక్తి-శ్రీకాళహస్తి మిచౌంగ్‌ తుపాను రూపంలో ప్రకతి కర్షకులను, సామాన్య ప్రజలను కోలుకోలేని దెబ్బతీసింది. మూడు రోజులపాటు పాటు కురిసిన ఈదుర గాలులతో కూడిన భారీ వర్షాలకు తూర్పు మండలాల్లో భారీగానే ఆస్తి నష్టం, పంటనష్టం వాటిల్లింది. కొన్నిచోట్ల ప్రాణ నష్టమూ చోటు చేసుకుంది. ముఖ్యంగా అన్నదాతలు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికందకుండా పోయాయి. వ్యవసాయ పంటలు, ఉద్యాన తోటలు కలిపి సుమారు 5 వేల హెక్టార్లకు పైగా దెబ్బతిన్నాయని సమాచారం. అదే విధంగా వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. వందల ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. వరద ధాటికి పంట పొలాలు కోతకు గురై సారవంతమైన భూమి కొట్టుకుపోయింది. నష్టం అంచనా కోట్లలోనే ఉంటుంది. అయితే తుపాను వెలసి నాలుగు రోజులు దాటిపోతున్నా సంబంధిత అధికారులు తుపాను ప్రభావంతో ఏర్పడ్డ పూర్తి నష్టాన్ని అంచనా వేయడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. కాకమ్మ కబుర్లతో కాలయాపన చేస్తున్నారన్న అపవాదు ఉంది. దెబ్బతిన్న పంటల్ని, పంట పొలాలను, ఇళ్లను అధికారులు ఎప్పుడు చూస్తారు..? చూస్తే నష్టపరిహారం వస్తుందా..? లేదా అనే ఆందోళన ఇప్పుడు రైతులతో పాటు సామాన్య ప్రజల్లో నెలకొంది. తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామంటూ ప్రభుత్వం మాటలు చెబుతున్నప్పటికీ, ఆ దిశగా ఆచరణ లేకపోయింది. అధికార యంత్రాంగం కూడా ఇప్పటి వరకు క్షేత్రస్థాయి పంట నష్టం, ఆస్తి నష్టంపై లెక్కలు వేసింది లేదు. గడిచిన రెండు రోజుల నుంచి ఎండ కాస్తుండటంతో రైతులు పొలాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టారు. నిల్వ ఉన్న నీటిని బయటికి తరలించుకోవడం, నేలకొరిగిన మొక్కలను కూలీల సాయంతో తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేసుకుంటున్నారు. జరిగిన నష్టం కంటికి కనిపించాలంటే ఇప్పటికే రైత్వారీ అంచనాలు చేపట్టాల్సి ఉంది. మరో రెండు రోజులు గడిస్తే అధికారుల కళ్లకు కనిపించదు. అప్పుడు ఏదో ఒక లెక్క రాసి మసి పూసి మారేడు కాయ చేసేస్తారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంట నష్టం 2 వేల హెక్టార్లేనట..!!మిచౌంగ్‌ తుపాను ప్రభావం తూర్పు మండలాలపై పెద్ద ఎత్తునే ప్రభావం చూపింది. ఒక్క తొట్టంబేడు మండలంలోనే వెయ్యి ఎకరాలకు పైగానే వరి పంటలు దెబ్బతిన్నట్లు అంచనా. అయితే శ్రీకాళహస్తి వ్యవసాయ శాఖ డివిజన్‌ పరిధిలోని శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు, కేవీబీ పురం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాలను కలుపుకొని కేవలం 2 వేల 241 హెక్టార్లలోనే పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనాకు రావడం గమనార్హం. వీటిల్లో వివిధ దశల్లో ఉన్న వరి పంటలు, వేరుశనగ, మినుము పంటలు మాత్రమే ఉన్నాయి. 608 ఎకరాల్లో ఇసుక మేటలు ఏర్పడ్డాయనీ, 143 ఎకరాల్లో భూమి కోతకు గురి అయినట్లు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అయితే తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం బోనుపల్లి, పెద్ద కనపర్తి గ్రామాల్లోనే 200 ఎకరాల్లో ఇసుకమేటలు, 100 ఎకరాల్లో పంట పొలాలు కోతకు గురైనట్లు బాధిత రైతులు వాపోతున్నారు. వరద ధాటికి పంటలు, పంట పొలాలు దెబ్బ తినడంతో పాటు విలువైన మైక్రో ఇరిగేషన్‌ పైపులు కొట్టుకొని పోయాయని రైతులు చెబుతున్నారు. మరి వ్యవసాయ అధికారులు ఇచ్చిన ప్రాథమిక నివేదికలో ఈ లెక్కలు ఉండకపోవడం శోచనీయం. ఇక ఆస్తి నష్టం విషయానికొస్తే సంబంధిత అధికారులు గానీ, ప్రజా ప్రతినిధులు గాని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించే దాఖలాలు లేవు. తుపాను ప్రభావంతో నిరాశ్రయులైన వారికి కంటితడుపు చర్యగా ఆహార పొట్లాలు అందజేశారే తప్పా, వారికి జరిగిన ఆస్తి నష్టం పై ప్రభుత్వానికి నివేదికలు పంపడంలో నిర్లక్ష్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్ర వీడి, పూర్తిస్థాయిలో తుపాను నష్టాన్ని అంచనావేసి బాధితులకు సత్వర సాయం అందేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.రూ. లక్ష నష్టం: గంగయ్య, రైతు, బోనుపల్లితుపాను కారణంగా ఎకరా పొలం కోతకు గురైంది. సారవంతమైన మట్టి కొట్టుకుపోయి రాళ్లు, నీళ్లు చేరాయి. డ్రిప్‌ పైపులు, సామగ్రీ కూడా వరదపాలైంది. నష్టం రూ. లక్ష పైమాటే. పొలాన్ని తిరిగి సాగులోకి తెచ్చేందుందుకు ప్రభుత్వం సాయమందించాలి.రెండెకరాల్లో ఇసుక మేటలు: రవి, రైతు, బోనుపల్లితుపానులో వచ్చిన వరదల కారణంగా నా రెండెకరాల పొలంలో ఇసుక మేటలు ఏర్పడ్డాయి. భూమి కోతకు గురైంది. డ్రిప్‌, సామగ్రి కొట్టుకుపోయింది. రూ.2 లక్షలు విలువజేసే డ్రిప్‌ వ్యవస్థను 90 శాతం రాయితీపై పెట్టించుకున్నా. ప్రభుత్వం ఆదుకోవాలి.వర్షానికి కుప్పకూలిన పేదల గుడిసెలు

➡️