అప్పుడంత.. ఇప్పుడింత..!

టెండరు మొత్తాన్ని పెంచుతూ ప్రతిపాదనకు వచ్చి మున్సిప్‌ కౌన్సిల్‌ ఆమోదం పొందిన తీర్మానం
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం ప్రారంభించిన కొన్ని పనులను రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో నిలిపేసిన విషయం తెలిసిందే. అయితే చిలకలూరిపేట పట్టణంలో వైసిపి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో అభివృద్ధి పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు తర్వాత వాటి విలువను పెంచుకోవడంతోపాటు వాటికి మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోద ముద్రా వేయించుకున్నారు.గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు విన్నవించిన సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సచివాలయానికి రూ.20 లక్షలు చొప్పున నిధులు మంజూరు చేసింది. అయితే చిలకలూరిపేట పట్టణంలో 29 సచివాలయాలకు గాను ఒక్కో సచివాలయానికి రూ.40 లక్షలు చొప్పున కేటాయించింది. ఈ నిధులతో రహదార్లు, డ్రెయినేజీ కాల్వల నిర్మాణం తదితర అభివృద్ధి పనుల కోసం ఆన్‌లైన్‌ ద్వారా టెండర్లను (ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెంటర్లు) ఆహ్వానించారు. 36 పనులకు టెండర్లను ఆహ్వానిస్తే ఒక్కో పనికి ఒక్కరు మాత్రమే టెండర్‌ వేయటం గమనార్హం. కాంట్రాక్టర్లు రింగయ్యారా? అధికారులతోనే వీరంతా కుమ్మక్కయ్యారా? అనే అనుమానాలు ఈ దశలోనే వచ్చాయి. దీనికితోడు డెంటరు దక్కించుకున్న కాంట్రాక్టర్లంతా టెండరు మొత్తాన్ని పెంచాలని కోరడం, వీటిని ఈనెల 27న నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో ఎజెండా పెట్టి ఆమోదించడంతో కుమ్మక్కు అనుమానాలు బలపడ్డాయి. ఒక్కో టెండరు మీద సుమారు 4.99 శాతం వరకూ మొత్తాన్ని పెంచాలని కోట్‌ చేయగా ఇందుకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. నిర్మాణ సామగ్రి, కూలీల ధరలు ఇటీవల కాలంలో ఏమైనా పెరిగాయా? అంటే అదీలేదు. ఇదిలా ఉండగా మున్సిపాల్టీ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం (డి2 సీట్‌)కు స్టేషనరీకి సంబంధించి 2024-25 సంవత్సరా నికిగాను రూ.15 లక్షలు, జిరాక్సుల కోసం రూ.50 వేలు కేటాయిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. ఇదే ఖర్చుతో మిషనరీ కొనుగోలు చేస్తే ప్రజాధనం దుర్వినియోగం కాకుండా ఉంటుందనే వ్యాఖ్యలూ వినిపించాయి.

➡️