అప్పుడు హామీలు.. ఇప్పుడు దాడులు..

Mar 6,2024 19:35

కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న వి.కృష్ణయ్య, ఇతర నాయకులు
ప్రజాశక్తి-సత్తెనపల్లి :
ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ 14న ఢిల్లీలో జరిగే బహిరంగ సభకు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో తరలిరావాలని రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. స్థానిక పుతుంబాక భవన్‌లో రైతుసంఘం పల్నాడు జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా చలోఢిల్లీ కరపత్రాన్ని నాయకులు ఆవిష్కరించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ 2021లో ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీల అమలు కోసం ఢిల్లీకి బయలుదేరిన రైతుల్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం సరిహద్దుల్లోనే అడ్డగించి అనేక విధాలుగా ఆటంకపరుస్తున్నాయని అన్నారు. కందకాలు తవ్వడం, మేకులు నాటడం, భారీ కేడ్లు, ముళ్ల కంచెలు పెట్టడం, వాటర్‌ క్యాన్లు, రబ్బర్‌ బుల్లెట్లు ప్రయోగించడంతోపాటు డ్రోన్ల ద్వారా విషవాయువులను చిమ్మించడం వంటి దుర్మార్గ చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ చర్యల వల్ల అనేక మంది రైతులు కళ్ళ చూపును, వినికిడి శక్తినీ కోల్పోయారని చెప్పారు. కాల్పుల్లో యువరైతు శుభకరణసింగ్‌ మృతి చెందాడని, మరో ముగ్గురు గుండె ఆగి చనిపోయారని గుర్తు చేశారు. 100కు పైగా ట్రాక్టర్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఈ సంఘటనలను టీవీ ఛానళ్లు, ఇతర ప్రసార మాధ్యమాల్లో ప్రచారం కాకుండా నిలిపివేశారని విమర్శించారు. ఈ కాలంలో నాలుగు సార్లు చర్చలు సాగించినా ఏ మాత్రమూ పురోగతి లేదన్నారు. పంటలకు మద్దతు ధర చట్టాన్ని గురించి ఇచ్చిన హామీపై మంత్రులు చర్చించడం లేదన్నారు. రైతులు కోరుతున్న మద్దతు ధర చట్టం చేస్తే ప్రభుత్వంపై రూ.11 లక్షల కోట్లకు పైగా ఆర్థిక భారం పడుతుందంటూ చెబుతున్నా అంత భారం పడదని ఆర్థిక నిపుణులు తేల్చారని వివరించారు. ఈ నేపథ్యంలో 540 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఈ నెల 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ జరగనుందని, అందులో భాగంగానే మండల, జిల్లా కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాల్లో, చలో ఢిల్లీలో రైతులు, కూలీలు పాల్గొనాలని కోరారు. తొలుత ఢిల్లీ రైతు ఉద్యమంలో చనిపోయిన రైతులకు సమావేశం సంతాపం తెలిపింది. పల్నాడు జిల్లాలోని వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానించింది. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు గద్దె చలమయ్య, పల్నాడు జిల్లా కార్యదర్శి ఎవిఎన్‌ గోపాలరావు, నాయకులు ఎం.నరసింహారావు, ఎ.ఆంజనేయులు, కె.రామారావు, బి.నాగేశ్వరరావు, ఎం.నాగేశ్వరరావు, జి.జాలయ్య పాల్గొన్నారు.

➡️