అప్పుల జీవితం.. దినదిన గండం..

Apr 2,2024 23:15

ప్రకాశక్తి – చిలకలూరిపేట : మూడు నెలలకుపైగా తమకు జీతాలు రావడం లేదని, పండగ రోజుల్లో పిల్లలకు బట్టలైనా కొనలేని దుస్థితిలో ఉన్నామని మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు వాపోతున్నారు. జీతాలు పెంచి ఇస్తామని హామీనిచ్చినా చివరికి అసలు జీతం కూడా సరిగా ఇవ్వడం లేదని ఆగ్రహానికి గురవుతున్నారు. పట్టణంలో పారిశుధ్య విభాగంలో 30 మంది శాశ్వత ఉద్యోగులు ఉండగా, ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన 250 మంది పని చేస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు మూడు నెలలు దాటినా జీతాలింకా రాలేదు. ఈనెల కూడా ఇంకా జమవ్వలేదు. వీరంతా అద్దె ఇళ్లల్లో ఉండేవారే కావడం, అద్దెలు చెల్లించలేకపోవడంతో కొంతమంది ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ అవమానాలకు తోడు విద్యుత్‌ బిల్లులు, ఇంట్లో సరుకులు, పిల్లల చదువులు, డ్వాక్రా కిస్తీలు, ఇతర ఖర్చుల కోసమూ ఇతరు వద్ద చేయి చాచాల్సి వస్తోంది. ఒకరి వద్ద అప్పు తీర్చడానికి మరొకరి వద్ద అధిక వడ్డీకి అప్పులు చేయాల్సిన దుస్థితిలో కార్మికులు గడుపుతున్నారు.పట్టణాన్ని శుభ్రంగా ఉంచే తాము ప్రశాతంగా నిద్రకూడా పోలేకపోతున్నామని, పిల్లలకు కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నామని కార్మికులు వాపోతున్నారు. వీరికి గతంలో రూ.15 వేలు జీతం, రూ.6 వేలు హెల్త్‌ ఎలవెన్స్‌ వేర్వేరుగా ఇచ్చేవారు. ఈ మొత్తాన్ని రూ.5 వేలు పెంచి రూ.26 వేలు ఇవ్వాలని గతంలో సమ్మె చేశారు. అయితే హెల్త్‌ అలవెన్స్‌ను జీతంలో కలిపి రూ.21 వేలు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అదే సందర్భంలో పండగ అదనపు బోనస్‌ కింద రూ.వెయ్యి కూడా ఇంత వరకు ఇవ్వలేదని, చివరికి జీతాలు కూడా పెండింగ్‌లో పెట్టారని సిఐటియు మండల కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు అన్నారు. సమ్మె కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. జీతాల పెండింగ్‌పై మున్సిపల్‌ కమిషనర్‌ సిహెచ్‌ గోవిందరావును సంప్రదించగా సిఎస్‌ఎంఎఫ్‌ ప్రస్తుతం పనిచేయటం లేదని, డబ్బులున్నా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. సిఎస్‌ఎంఎఫ్‌ పని చేయడం ప్రారంభించిన వెంటనే జీతాలిస్తామని చెబుతున్నారు.

➡️